సునీల్ కుమార్ సస్పెన్షన్.. కర్మ ఫలం అనుభవించాల్సిందేగా?
Publish Date:Mar 2, 2025
Advertisement
మారేవి ప్రభుత్వాలే కానీ, చట్టాలు కాదు. అందుకే అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘించి, చట్టాలను చుట్టాలుగా భ్రమించి వ్యవహరించిన అధికారులకు శృంగభగం తప్పదు. ఈ విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రుజువైంది. ఆ తరువాత ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా రుజువు అవుతోంది. అప్పట్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి.. ఏలిన వారి మొప్పు కోసం ఇష్టారీతిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులు కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ లు ఇప్పుడు చట్టపరంగా కేసులను ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకున్నారు. జగన్ సర్కార్ పతనమైన తరువాత.. ఆయన హయాంలో అడ్డగోలుగా వ్యవహరించి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు కూటమి ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వలేదు. అంతే కాదు జగన్ హయాంలో అయ్యా ఎస్ అంటూ వైసీపీ కనుసన్నలలో వారి కనుసైగల మేరకు పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లు ఇప్పడు చట్టం బోనులో నిలబడక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెండయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లినందుకు, అప్పటి వైసీపీ రెబల్ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులలో ఐపీఎస్ సునీల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2020 -2024 మధ్య కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లడం ద్వారా అఖిల భారత సర్వీస్ రూల్స్ ను సునీల్ కుమార్ ఉల్లంఘించారు. దీనిపై ప్రభుత్వం గతంలోనే రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా నేతృత్వంలో విచారణ కమిటినీ ఎర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఇప్పుడు సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఉండగా సునీల్ కుమార్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు బనాయించి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అలాగే ఇటీవలి కాలంలో కూడా అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రసంగాలు చేశారు. కులాల ప్రస్తావన తీసుకువస్తూ.. ప్రభుత్వంపై పోరాటానికి, అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. అలాగే సామాజిక మాధ్యమం వేదికగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకమే. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
http://www.teluguone.com/news/content/ap-cid-former-chief-sunil-kumar-susoended-39-193724.html





