అధికార పక్షమే.. ప్రతిపక్షం.. గౌరవ సభగా ఏపీ అసెంబ్లీ!
Publish Date:Jul 30, 2024
Advertisement
తెలుగుదేశం అధినేత చంద్రబాబు చెప్పింది చేసి చూపించారు. బూతులు, అనుచిత వ్యాఖ్యలతో కౌరవ సభగా మారిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని గౌరవ సభగా మార్చేశారు. అర్ధవంతమైన చర్చలతో రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాసమస్యల పరిష్కారం లక్ష్యంగా సభను సాగిస్తున్నారు. ఔను జగన్ హయాంలో ఐదేళ్ల పాటు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించాలంటేనే ఏటువంటి అనుచిత వ్యాఖ్యలు వినాల్సి వస్తుందోనని జనం భయపడ్డారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అర్ధవంతంగా సాగాయి. గతంలో అంటే జగన్ హయాంలో శాసనసభ కౌరవ సభలా మారింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా అప్పటి విపక్ష నేత చంద్రబాబు ప్రకటించి.. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెట్టి.. కౌరవ సభను గౌరవ సభగా మారుస్తానని ప్రతిజ్ణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా సభను గౌరవ సభగా మార్చారు. ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై అర్ధవంతమైన చర్చలతో సభను నిర్వహిస్తున్నారు.
ఒక పక్క పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సైతం జరుగుతున్నాయి. వీటితో పాటుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ఐదు రోజుల పాటు జరిగాయి. లోక్ సభ, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా, విమర్శలు, ప్రతి విమర్శలు, ప్లకార్డుల ప్రదర్శనలు, వాదోపవాదాలతో సాగుతుంటే.. ఏపీ అసెంబ్లీ మాత్రం ప్రశాంతంగా అర్థవంతమైన చర్చలతో, అధికార పక్షమే విపక్ష పాత్ర కూడా పోషిస్తూ సమస్యలకు పరిష్కారం దిశగా సమాలోచనలు చేస్తూ సాగుతోంది.
ఏపీలో తెలుగుదేశం కూటమికి ప్రజలు పట్టం కట్టారు. విపక్షమే లేదా అన్నట్లుగా 175 మంది సభ్యులుండే అసెంబ్లీలో విపక్ష వైసీపీకి చెందిన 11 మంది సభ్యులు మాత్రమే విజయం సాధించారు. అయితే ఆ 11 మందీ కూడా సభకు హాజరు కాలేదు. అయినా ఏపీ అసెంబ్లీలో అధికార విపక్ష పాత్రలను తెలుగుదేశం కూటమి సభ్యులే పోషిస్తున్నారు. పాలక పక్షమే ప్రతిపక్షంగా మారి అర్ధవంతమైన చర్చలకు నిలయంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సాగుతోంది. గత ఐదేళ్లుగా అసెంబ్లీ ని కౌరవ సభగా మార్చిన జగన్ కు ఇప్పుడు గౌరవ సభ ఎలా ఉంటుందో చేసి చూపించారు సభా అధ్యక్షుడు చంద్రబాబు. నాడు విపక్ష నేతగా తానేం చెప్పారో అది నేడు చేసి చూపిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన అప్పుల పైనా, జగన్ సర్కార్ విధి విధానాలపై ఎ శ్వేత పత్రాలను విడుదల చేస్తూ ప్రజలకు అన్ని విషయాలపైనా పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో పేదవాడి ఆకలి తీర్చడానికి 5 రూ.కే అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటిస్తే వాటితో పాటుగా డొక్కా సీతమ్మ క్యాంటిన్లను కూడా ఏర్పాటు చేయాలనీ ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఆయన సూచనపై సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసే మధ్యాన్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరును ఖరారు చేసారు. విద్యాశాఖ మంత్రి లోకేష్. అలాగే ఆయా శాఖల మీద, వాటి విధి విధానాల మీద ఎమ్మెల్యే లు తమకున్న సందేహాలను, అపోహలను సభలోనే చర్చల రూపంలో అడిగి తెలుసుకుంటున్నారు. ఒక అర్ధవంతమైన గౌరవ సభ మాదిరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. విపక్షం లేకపోయినా, ఆ పాత్రను అధికారపక్షమే ప్రోత్సహిస్తూ సభా గౌరవాన్ని ఇనుమడింప చేస్తోంది.
http://www.teluguone.com/news/content/ap-assembly-ruling-party-act-opposition-39-181750.html





