మహా రాజకీయంలో మరో మలుపు?
Publish Date:Oct 18, 2022
Advertisement
రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఉహించడం అంత తేలికైన వ్యవహారం కాదు. అంతవరకు ఉప్పు నిప్పులా ఉన్న పార్టీలు ఒక్కసారిగా చేతులు కలిపెసినా ఆశ్చర్య పోనవసరం ఉండదు. ఇప్పుడు మహా రాష్ట్రలో అదే జరిగింది. బీజేపీ, శివసేన ఒకప్పుడు, సహజ మిత్ర పక్షాలు. ఒక విధంగా ఆ రెండు పార్టీలది ఒకటే డిఎన్ఎ, ఒకటే రక్తం. అందుకే హిందుత్వ బంధంతో ముడి వేసుకున్న ఆ రెండు పార్టీలు, ఎప్పటికీ విడిపోవని, విడిపోయినా మళ్ళీ అదే హిదుత్వ బంధం ఆ రెండు పార్టీలను కలిపేస్తుందనే నమ్మకం రెండు పార్టీలలో బలంగా నాటుకు పోయింది. అయితే అటు శివసేన ఇటు బీజేపీ నాయకత్వంలో తరాల అంతరాలు రావడం రాజకీయ ఆకాంక్షలు పెరగడంతో పరిస్థితి క్రమక్రమంగా మారుతూ వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అయితే, ముఖ్యమంత్రి కుర్చీ విషయంలో వివాదం రావడంతో రెండు పార్టీలు విడిపోయాయి.శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారు. మూడు పార్టీలు కలిసి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అంతర్గత వైరుధ్యాలతో ఎంవిఎ ప్రభుత్వం త్వరలోనే కులిపోతుందని అనుకున్నా, శరద్ పవార్ చలవతో ఠాక్రే సర్కార్ మూడేళ్ళు పూర్తి చేసుకుంది. అయితే, ఇంతలోనే శివసేనలో ముసలం పుట్టింది. పార్టీ రెండుగా చీలింది. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగరేశారు. బీజేపీ తెర వెనక చక్రం తిప్పింది. ఇంచుమించుగా నెలరోజుల పాటు సాగిన నాటకీయ పరిణామాలకు తెర దించుతూ జూన్ 30, 2022 న షిండేముఖ్యమంత్రిగా బీజేపీ, శివసేన ( షిండే) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపధ్యంలో శివసేన ఇరు వర్గాలు బాల్ ఠాక్రే హిందుత్వ వారసత్వం శివసేన పేరు, పార్టీ గుర్తు తమదంటే తమదని నిరూపించుకునేందుకు ఓ వంక రాజకీయ పోరాటాలు, మరో వంక న్యాయ పోరాటం సాగిస్తున్నాయి. ఈ పోరాటంలో సహజంగానే, బీజేపీ షిండే వర్గానికి కొమ్ము కాస్తోంది. అయితే ఇప్పడు బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక బరిలోంచి తమ అభ్యర్ధి ముర్జీ పటేల్‌ను ఉపసంహరించుకుంది. శివసేన (ఠాక్రే) వర్గం అభ్యర్ధి ఏకగ్రీవ ఎన్నికకు లైన్ క్లియర్ చేసింది. ఒక విధంగా బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యమంత్రి షిండే వర్గానికి షాక్. అని చెప్పవచ్చని అంటున్నారు. అయితే, బీజేపీ, మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా అనుసరిస్తూ వస్తున్న, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంలో, దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఏకగ్రీవ ఎన్నికకు అనుకూలంగా ఇతర పార్టీలు తమ అభ్యర్ధులను బరిలో దించరాదనే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ అభ్యర్ధిని ఉపసంహరించుకున్నామని బీజేపీ ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయం వెనక వ్యూహాత్మక రాజకీయ కోణం దాగుందని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. బీజేపీ ముందుగానే. ఏకగ్రీవ సంప్రదాయాన్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటే అది మరోలా ఉండేది. కానీ, శివసేన రెండువర్గాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా పార్టీ పేరు, సింబల్ ను కేంద్ర ఎన్నికల సంఘం స్తంబింప చేసిన తర్వాత, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అభ్యర్ధన మేరకు. అంటూ చివరి క్షణంలో అభ్యర్ధిని ఉప సంహరించుకోవడంతో కమల దళం వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మహా రాజకీయాలలో చర్చనీయాంశంగ మారిందని అంటున్నారు. అలాగే, దీర్ఘ కాలంలో హిందుత్వ ఓటు చీలకుండా చూసేందుకు,శివసేన రెండు వర్గాలను ఏకం చేసి అక్కున చేర్చుకునే వ్యూహంతో బీజేపీ కథ నడిపిందని అనుకోవచ్చని అంటున్నారు. అందుకే బీజేపీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వెనక ఇంకేదో రాజకీయం ఉండి మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శివసేనలో చీలిక అనంతరం జరుగుతున్న అంధేరీ ఉప ఎన్నికను శివసేన రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి షిండే వర్గం పోటీలో లేకున్నా, మిత్రపక్షం బీజేపీ అభ్యర్ధిని గెలిపించి, ఠాక్రే వర్గంఫై పైచేయి సాధించాలని వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అయితే, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదన్నట్లుగా, శివసేనను పూర్తిగా కబ్జా చేసేందుకు, షిండే వర్గం సిద్దం చేసుకున్న స్కెచ్ ని బీజేపీ మార్చేసిందని అంటున్నారు. అయితే అంధేరీ ఉప ఎన్నిక కంటే అత్యంత కీలకం అయిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజీపీ వ్యుహతమక నిర్ణయం తీసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవంక, శివసేన (ఠాక్రే) వర్గం రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాత్రం,అంధేరీ ఈస్ట్ నియోజక వర్గంలో బీజేపీ నిర్వహించిన సర్వేలో, తమ అభ్యర్ధి ముర్జి పటేల్ ఓటమి తధ్యమని తెలిసిన నేపధ్యంలోనే బీజేపీ రాజ్ ఠాక్రేను తెర మీదకు తెచ్చి పోటీ నుంచి తప్పు కుందని అన్నారు. ఏది ఏమైనా, శివసేనను సక్సెస్ ఫుల్ గా ముక్కలు చేసిన బీజేపీ, ఇప్పడు మళ్ళీ అతుకులను కలిపి కుట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్య పరుస్తోందని అంటున్నారు. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల నాటికి తెగిన పాత బంధాన్ని మళ్ళీ ముడి వేసి, మహారాష్ట్రలో హిందుత్వ శక్తులను ఏకం చేసే లక్ష్యంతోనే బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. నిజానికి, అది భయమైనా, భక్తి అనుకున్నా మహారాష్ట్రంలో హిందుత్వ వాదానికి ప్రతీకగా నిలిచిన బాల్ ఠాక్రే వారసత్వాన్ని ముక్కలు చేయడం కమల దళం కోరుకోవడం లేదని బీజేపీ నాయకులు అంగీక రిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/another-turn-in-maharashtra-politics-25-145617.html





