అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన కలెక్టర్
Publish Date:Jul 9, 2025
Advertisement
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్‌లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్‌లో భోజనం అందుకున్నారు. ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్ లోపల, బయట, చుట్టుపక్కల పారిశుధ్యం తనిఖీ చేయాలనుకున్న జిల్లా కలెక్టర్, ఆకస్మికంగా క్యాంటీన్‌కు వెళ్ళారు. భోజనంకు వచ్చిన వారితో పాటు ఆహారం తింటూ అన్నా కాంటీన్ లో ఆహార నాణ్యత తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారి స్పందనను కోరారు. అన్నా క్యాంటీన్ నాణ్యత, నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి పరిచారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం రోజుకు దాదాపు రూ.90 ఖర్చు చేసి, వారికి రూ.15 కనీస ఖర్చుతో అందిస్తున్నదన్నారు. ప్రజలు అన్నా కాంటీన్ లో ఆహారాన్ని తీసుకోవాలని, ఆకలితో ఉండకూడదని కోరారు. క్యాంటీన్‌లో ఏవైనా లోపాలు ఉంటే తెలియజేయాలని, వాటిని వెంటనే సరిచేస్తామని అన్నారు.
http://www.teluguone.com/news/content/anna-canteen-39-201619.html





