ఏపీ మద్యం కుంభకోణం కేసు.. నిన్న రజత్ భార్గవ - నేడు విజయసాయి
Publish Date:Jul 12, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు ఎవరూ ఊహించనంత లోతుగా వెళ్తోంది. చాలా పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కుంభకోణం ఎలా జరిగిందో.. డబ్బులు ఎలా రూట్ అయ్యాయో మొత్తం తెలుసుకున్న సిట్.. ఇప్పుడు అందులో పాత్రధారులు, సూత్రధారుల్నే కాదు.. డమ్మీలుగా వాడుకున్న అధికారులతో కలిపి డాట్స్ కలుపుతోంది. దీంతో కేసు దర్యాప్తు అసలు కింగ్ పిన్ దగ్గరకు చేరువ అవుతోంది. కొన్ని నెలల కిందటే రిటైర్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు చాలా సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు తన పర్యటనలలో రజిత్ భార్గవను ఆయనను పక్కన పెట్టుకునే ఎక్కువ దేశాలకు తిరిగేవారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాత్రం రజత్ భార్గవ పరిస్థితి తారుమారైంది. జగన్ రజత్ భార్గవను ఆయనను ముందు పెట్టి మద్యం కుంభకోణం వ్యవహారం నడిపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జగన్ హయాంలో ఉన్నతాధికారిగా రజత్ భార్గవ పాత్ర పరిమితం అయిపోయిం దంటారు. ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా సిట్ దర్యాప్తులో బయటకు వస్తున్నది. సిట్ ఎదుట రజత్ భార్గవ్ మద్యం కుంభకోణం గుట్టు రట్టు చేశారని, పూసగుచ్చినట్లు జరిగిందేమిటో చెప్పేశారని అంటున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన క్లూస్ అన్నీ రజత్ భార్గవ సిట్ కు ఇచ్చేశారని అంటున్నారు. ఇక పోతే ఈ కేసులో ఏ5గా ఉన్న విజయసాయిరెడ్డి శనివారం (జులై 12)న సిట్ ముందు హాజరయ్యారు. ఆయన గతంలోనే ఈ కుంభకోణం విషయంలో తనను తాను విజిల్ బ్లోయర్ గా చెప్పుకున్నారు. ఆయన చెప్పుకున్నదానికి సార్థకత రావాలంటే.. ఇంకా చాలా చాలా చెప్పాల్సి ఉంటుందని సిట్ అధికారులు అంటున్నారు. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియాఅంతా రాజ్ కేసిరెడ్డే అని అంటున్నారు.. కానీ కుంభకోణంలో డబ్బంతా జగన్ రెడ్డికి చేరిందంని మాత్రం చెప్పడం లేదు. అలాగని చేరలేదని కూడా చెప్పడం లేదు. ఆ విషయం తనకు తెలియదంటున్నారు. నేరుగా కాకపోయినా.. కొన్ని క్లూస్ ఆయన దర్యాప్తు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఆయన కూడా జైలుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అలాంటిది రాకూడదనే విజయసాయిరెడ్డి ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు. తాజా విచారణలో సిట్ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని విజయసాయిరెడ్డి ఇస్తారని భావిస్తున్నారు. రూ.32 కోట్ల వరకూ లిక్కర్ స్కామ్ సొమ్మును జప్తు చేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ జరిగిన స్కాంలో ఇది చాలా చిన్న మొత్తం. వందల కేజీల బంగారం, అంతకు మించి షెల్ కంపెనీల్లో నగదు. భారతి సిమెంట్స్, పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లోకి చేరిన నగదు, ఇంకా డెన్‌లలలో మిగిలి ఉన్న నోట్ల కట్టల బండిల్స్ ను సిట్ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి బయటకు తీసుకు రావడం చాలా అవసరం.
http://www.teluguone.com/news/content/andhrapradesh-liquor-scam-sit-investigation-25-201830.html





