ఏపీ మద్యం కుంభకోణం కేసు..జగన్ అరెస్టు ఖాయమంటున్న పేర్ని?
Publish Date:May 17, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మరో వైపు ఈడీ కూడా రంగ ప్రవేశం చేసింది. ఇప్పటికే ఈ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారేందుకు రెడీ అయ్యారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఈడీ కూడా రాజ్ కేసిరెడ్డిని విచారించి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇలా ఉండగా ఇదే కేసులో మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీం కోర్టు ఇలా బెయిలు నిరాకరించగానే సిట్ అలా అరెస్టు చేసింది. ఈ కేసులో వీరిద్దరూ ఏ31, ఏ32 నిందితులుగా ఉన్నారు. శనివారం వీరిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచే అవకాదశం ఉంది. మొత్తం మీద మద్యం కుంభకోణం కేసు విషయంలో ఒక లాజికల్ ఎండ్ కు వచ్చే దశగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి అరెస్టు జగనే అంటూ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని బాంబు పేల్చారు. గతంలో అంటే జగన్ అధికారంలో ఉండగా తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్ ను అరెస్టు చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నదన్నారు. వాస్తవానికి మద్యం కుంభకోణం కేసులో ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం కూడా లేదనీ, అయినా కూడా జగన్ కు సన్నిహితంగా ఉన్న వారందరినీ అరెస్టు చేసి వారి చేత బలవంతంగా జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఏదో విధంగా జగన్ ను అరెస్టు చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పేర్ని నాని విమర్శలు, ఆరోపణల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో జగన్ ను అరెస్టు చేస్తామని అటు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ కానీ, తెలుగుదేశం పార్టీ నేతలు కానీ ఎవరూ ఇప్పటి వరకూ చెప్పలేదు. ఎవరి నోటా రాని జగన్ అరెస్టు మాట మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నొ నాని నోటి వెంట రావడమే పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఈ కేసులో జగన్ ప్రమేయం బయటపడటం ఖాయం, జగన్ అరెస్టు తథ్యం అని వైసీపీ శ్రేణులకు పేర్ని నాని చెప్పకనే చెప్పినట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద మద్యం కుంభకోణం కేసులో జగన్ అరెస్టు తప్పదన్న భావనకు పేర్నినాని వచ్చేసినట్లే కనిపిస్తోందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/andhrapradesh-liquor-scam-case-39-198217.html





