కేసీఆర్ని తిడదాం.. ఆంధ్రాలో నిలబడదాం!
Publish Date:Jul 7, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అడ్డంగా విభజించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రాంతంలో అడ్డంగా ఆరిపోయింది. ఏదో బావుకుందామనుకున్న తెలంగాణలో కూడా అడ్రస్ గల్లంతయింది. సరే, తెలంగాణలో గౌరవప్రదమైన స్థానాలు పొందిన కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలో ఓ పాతికేళ్ళ తర్వాత అయినా అధికారంలోకి వస్తామన్న ఆశ వుండి వుండొచ్చు. అయితే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి యాసిడ్, ఫినాయిల్ వేసి కడిగినట్టుగా అయిపోయింది. ఒక్క పార్లమెంట్ సీటుగానీ, అసెంబ్లీ సీటుగానీ గెలవలేక మటాషైపోయింది. తెలంగాణలో మాదిరిగా ఏ పాతికేళ్ళకో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదన్న విషయం స్పష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పరువు నిలపడానికి ‘జీరో’ పాయింట్ నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర విభజనకు కారణమైన ప్రధాన వ్యక్తి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత వుంది. ఆ వ్యతిరేకతను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సానుభూతిని పొందాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు భావిస్తు్న్నట్టు తెలుస్తోంది. మామూలుగానే కేసీఆర్ నిరంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజల కడుపు కాలే మాటలు మాట్లాడుతూ వుంటారు, అలాంటి పనులే చేస్తూ వుంటారు. వాటిని అంది పుచ్చుకుని రాజకీయంగా మైలేజ్ పొందాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని రాజకీయ పరిశీకులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మీద భారీ స్థాయిలో మాటల దాడి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సానుభూతి పొందాలన్నది కాంగ్రెస్ నాయకుల యోచనగా తెలుస్తోంది. ఏ విషయం మీద అయినా కేసీఆర్ మీద మితిమీరిన మాటల దాడి చేయాలని, కేసీఆర్ ఎంత పచ్చిగా మాట్లాడతారో అంతే పచ్చిగా కేసీఆర్ని విమర్శించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు ఎవరిమీద అయినా హద్దులు మీరి మాట్లాడరు. ఇక జగన్ పార్టీ నాయకులైతే కేసీఆర్ అభిమానులు.. ఆయన్ని పల్లెత్తు మాట కూడా అనరు. ఇలా కేసీఆర్ని తిట్టే విషయంలో ఏర్పడిన గ్యాప్‌లో దూరిపోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/andhra-pradesh-congress-party-37-35606.html





