ఎమ్మెల్యేను చితకబాదిన కార్యకర్తలు.. వైసీపీలో వర్గ విభేదాలు భగ్గు
Publish Date:Apr 30, 2022
Advertisement
వైసీపీ హయాంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు. పైగా సొంత పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడి గాయపరిచినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరేం చేయలేకపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థికి కొత్తపల్లి జిల్లాలో శనివారం ఉదయం జరిగిన సంఘటన అద్దం పడుతుంది. ఏలూరు జిల్లాలో వైసీపీలో వర్గ విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. చివరికి హత్య, దాడుల వరకూ వెళ్లాయి. వరుస సంఘటనలతో జి.కొత్తపల్లి గ్రామం శనివారం ఉదయం నుంచీ అట్టుడికి పోతున్నది. వైసీపీ జి.కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు శనివారం ఉదయం హత్యకు గురయ్యారు. ఈ హత్య పార్టీలోని వైరివర్గం వారే చేశారనీ, ఆ వర్గానికి ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉందనీ ఆరోపిస్తూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే వైసీపీ కార్యకర్తలు చితకబాదారు. ద్వారకా తిరుమల మండలంలోని జీ. కొత్త పల్లిలో శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జి కొత్తపల్లి వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ గ్రామ అధ్యక్షుడు శనివారం ఉదయం హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక ఉన్నది గోపాలపురం ఎమ్మెల్యే వర్గమేనన్న అనుమానంతో ఈ దాడి జరిగింది. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్ముడిగా దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా వారు దాడిని నిలువరించడంలో విఫలమయ్యారు. దాడిలో గాయపడిన తలారి వెంకట్రావును పోలీసులు అతి కష్టం మీద అక్కడి నుంచి తరలించగలిగారు.
http://www.teluguone.com/news/content/anarchy-in-ycp-rule-ruling-party-mla-wounded-in-ycp-workers-attack-39-135248.html





