ఆనందయ్య మందు తయారీ షురూ.. పంపిణీ ఎప్పుడంటే?
Publish Date:Jun 2, 2021
Advertisement
దేశ వ్యాప్తంగా చర్చగా మారిన, లక్షలాది మంది కోరుకుంటున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు, ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో మందు తయారీపై దృష్టి సారించారు ఆనందయ్య. కృష్ణపట్నంలో కరోనా నివారణ ఔషద తయారీకి ఏర్పాట్లను మొదలు పెట్టారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఆనందయ్య. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా అకాడమీని ఎంచుకున్నారని తెలుస్తోంది. కృష్ణపట్నం పోర్టు అకాడమీ ప్రాంగణంలో మందు తయారీ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్ నిర్మిస్తున్నారు. షెడ్ నిర్మాణం కోసం ఆనందయ్య భూమి పూజ చేశారు. భగవాన్ వెంకయ్య స్వామి శిష్యుడు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల్లో షెడ్ నిర్మాణం.. ఇతర సదుపాయాల కల్పన పూర్తవుతుంది. తర్వాత మందు తయారీని మొదలు పెట్టి… సోమవారం నుండి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఆనందయ్య. గతంలో చేసినట్లే తన తోటలోనే మందు తయారీకి ఆనందయ్య సిద్ధమయ్యారు. అయితే ప్రభుత్వం అంగీకరించలేదు. ఆనందయ్య తోటలో కాకుండా…మందును కృష్ణపట్నం పోర్టులో తయారు చేయాలని సూచించింది. బహిరంగ ప్రదేశంలో మందు తయారు చేయడం సరికాదనే తెలిపింది. తోటలో మందు తయారీ చేయడం సెంటిమెంట్‌గా ఫీలవుతున్నట్లు ఆనందయ్య చెప్పినప్పటికి …అధికారులు వినకపోవడంతో చివరికి కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఆనందయ్య అంగీకరించారు. కరోనా మందు తయారికి కావాల్సిన వనమూలికలు సమకూర్చుతున్నారు ఆనందయ్య మనుషులు. గురువారం నుంచి మందు తయారు చేయనున్నారు. నాలుగైదు రోజుల్లో మందు తయారు చేసి ఈనెల 7వ సోమవారం నుంచి మందు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకేచోట కాకుండా డీ సెంట్రలైజ్డ్ పద్ధతిలో మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్, కర్ఫ్యూ నిబంధనల నేపధ్యంలో ఎవరూ కృష్ణపట్నం రావద్దంటున్నారు అధికారులు. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు మందును పంపిణీ చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆన్లైన్లో యాప్ ద్వారా మందు కోసం బుక్ చేసుకోవచ్చన్నారు. ఆనందయ్య పంపిణీ చేసే మందును మొబైల్ యాప్ ద్వారా బాధితులకు అందించాలని నిర్ణయించారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం ప్రత్యేకంగా యాప్ రూపకల్పన చేయాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ యాప్ రూపకల్పన పూర్తయిన తర్వాత అందులో వివరాలు ఎలా పొందుపరచాలో.. ఎంతమేర మందును వినియోగించాలో.. బాధితులు మందును ఎలా వాడాలో కూడా ఆ యాప్‌లో పొందుపరుస్తామని కలెక్టర్ చక్రధర్. అయితే ఈ యాప్‌ని ఎవరు తయారు చేస్తున్నారు…అది ఎప్పటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మిగిలిన ఐదు రోజుల్లో ఇదంతా సాధ్య పడే విషయమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు www.childeal.in పేరుతో website ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆనందయ్య కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సైట్ లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీ చేస్తామని చెప్పారు.
http://www.teluguone.com/news/content/anandaiah-medicine-product-start-at-krishnpatnam-port-39-116813.html





