అగ్నివీరులకు ఉద్యోగాలు..ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్
Publish Date:Jun 20, 2022
Advertisement
ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంలో దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. దేశంలో ఏ సంఘటన జరిగినా తనదైన స్టైల్ లో స్పందించే మహీంద్ర గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా అగ్నిపథ్ పథకంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాకాండపై విచారం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకాన్ని స్వాగతిస్తూనే ఆయన అగ్నివీరులకు ఓ చక్కని ఆఫర్ ప్రకటించారు. అగ్నిపథ్ పథకం ద్వారా సైన్యంలో చేరి నాలుగేళ్లు దేశానికి సేవ చేసి, బయటికి వచ్చిన అగ్నివీరులకు తమ గ్రూప్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అగ్నిపథ్ ద్వారా శిక్షణ పొందిన సమర్థులైన యువతకు ఉద్యోగం ఇచ్చేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. అగ్నివీరులు నేర్చుకున్న క్రమశిక్షణ, నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, ఫిజికల్ ట్రైనింగ్ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయన్నారు. అగ్నివీరులకు కార్పొరేట్ రంగంలో చక్కని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అగ్నివీరులకు కార్పొరేట్ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. నాయకత్వం, టీంవర్క్, దేహ దారుఢ్యంలో శిక్షణ పొందిన అగ్నివీరులు.. కార్పొరేట్ రంగానికి వృత్తిపరమైన పరిష్కారాలు అందించగలరు. కార్యకలాపాల నుంచి పాలనా వ్యవహారాలు, సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ ఇలా అన్ని విభాగాల్లోనూ వారికి అవకాశాలుంటాయి అని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో పేర్కొన్నారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా హింస చెలరేగడం బాధ కలిగిస్తోందని ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పాటు మాత్రమే ఆర్మీలో సేవలందించేలా కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరుద్యోగ యువత భగ్గుమంటోంది.
http://www.teluguone.com/news/content/anand-mahindra-offers-jobs-to-agniveer-in-his-organisation-25-138043.html





