యాదాద్రిలో వసూళ్ల పర్వం..అధికారుల మధ్య వాటాల పేచీతో బహిర్గతమైన రహస్యం!
Publish Date:May 3, 2022
Advertisement
యాదగిరిగుట్ట దేవస్థానంలో వసూళ్ల పర్వం సాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టపై వ్యాపారాలకు అనుమతి విషయంలో గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారన్నది ఆరోపణల సారాంశం. ఈ వసూళ్ల బాగోతంలో దేవస్థానం అధికారుల హస్తం ఉందని యాదగిరి గుట్ట జేఏసీ ఆరోపిస్తున్నది. ఈ తతంగం వసూళ్ల వాటాల పంపకంలో అధికారుల మధ్య తలెత్తిన విబేదాలతో బట్టబయలైందంటున్నారు. వాటాల విషయంలో తేడాలోచ్చి ఇద్దరు అధికారుల మధ్య బహిరంగంగా జరిగిన వాగ్వాదంతో విషయం వెలుగులోనికి వచ్చిందంటున్నారు. పంపకాల్లో తేడా కారణంగా నిన్న మొన్నటి దాకా చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఇద్దరు అధికారులు నువ్వెంతంటే నువ్వేంత అనుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారనీ, దేవస్థానం ఉద్యోగులే చెబుతున్నారు. అయితే వసూళ్ల విషయం అధికారుల మధ్య విభేదాలతో రచ్చకెక్కినా, ఆగిపోలేదనీ, ఇప్పుడు ఇద్దరు కాకుండా ఒకరే అంతా చక్కబెడుతున్నారనీ చెబుతున్నారు. ఇంతే కాకుండా విరాళాలు, ఇతరత్రా మార్గాల ద్వారా దేవస్థానానికి రావాల్సిన నిధులు వ్యక్తుల చేతుల్లోకి మళ్లుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుట్టపై వ్యాపార కేంద్రాలు తెరిపించాలన్నా.. మూయించాలన్నా.. టెండర్లను పిలవాలన్నా.. పిలిచిన టెండర్లను రద్దు చేయాలన్నా ఒక అధికారి కనుసన్నల్లో జరుగుతున్నాయనీ, ఆ అధికారి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడేందుకు దోహదపడే విధంగా ఇదంతా ఉన్నతాధికారులే అనుమతిస్తున్నారనీ దేవస్థానానికి చెందిన ఉద్యోగులే ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. ఇప్పటికే ఈ అధికారిపై విచారణ జరపాలని ఎండోమెంట్ కమిషనర్ కు స్థానిక యూత్ జేఏసి ఫిర్యాదు చేసింది. దేవాదాయ ధర్మాదాయ విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఇంట్లో జరుగబోయే శుభకార్యానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులను వ్యాపార కేంద్రాల వారి నుంచి ఆ అధికారి సేకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అధికారి జరుపనున్న శుభకార్యానికి సంబంధించి ఒక ఖర్చును కూడా పూర్తిగా ఈ అధికారే బాధ్యతను తీసుకున్నట్టు కూడా దేవస్థానం ఉద్యోగులు ఆరోపణలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల అండతోనే నిబంధనలకు విరుద్దంగా ఎక్కడపడితే అక్కడ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకునేలా నిర్ణయాలు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఏ మార్గనిర్దేశక సూత్రాల ఆధారంగా, ఏ నియమనిబంధనల ప్రకారంగా, ఏ ఉత్తర్వుల పరిధిలో ఈ వ్యాపార కేంద్రాలను తెరుస్తున్నారనేది తేల్చాలని జేఏసీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంపై అవినీతి నిరోధక శాఖకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు జేఏసి ప్రతినిధులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/an-officer-corruption-inyadadri-25-135383.html





