‘ట్రంప’రితనం.. రష్యాపై కోపం.. భారత్ పై 500శాతం సుంకం!
Publish Date:Jul 12, 2025
Advertisement
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెంపరితనం వెర్రితలలు వేస్తోంది. ఉక్రెయిన్ తో నాన్ స్టాప్ వార్ చేస్తోన్న రష్యాను కట్టడి చేయడానికి ఆయనొక కొత్త మార్గం కనిపెట్టారు. దానిపేరే భారీ ఎత్తున సుంకాల విధింపు. గత కొంత కాలంగా భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొంటోంది. ఒక్క భారత్ మాత్రమే కాదు రష్యా నుంచి చైనా, టర్కీ, ఇతర ఆఫ్రికన్ దేశాలెన్నో చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ విడ్డూరమేంటంటే.. రష్యాపై తాము అధిక సుంకాలు విధించి శిక్ష విధించదలుచుకున్నాం కాబట్టి.. రష్యా నుంచి చమురు కొనే దేశాల నుంచి మా దేశంలో దిగుమతి చేసే వస్తువులపై 500 శాతం మేర పన్ను విధిస్తామంటున్నారు. ఈ బిల్లును రిపబ్లికన్ సెనెటర్ గ్రాహం ఏప్రిల్ నెలలో ప్రతిపాదించగా.. దాన్ని ట్రంప్ కూడా బాగానే ఉందని అన్నారు. కేబినెట్ మీటింగ్ తర్వాత ఆయన్ను అడిగిన మీడియా వారికి అవును ఇది నా ఎంపిక అంటూ బాహటంగా కుండ బద్ధలు కొట్టారాయన. ఒక్క గ్రాహంతో పాటు 84 మంది సెనెటర్లు.. ఈ రష్యన్ ఈ శాంక్షన్ బిల్- 2025కి మద్ధతుగా ఉన్నారట. ఈ బిల్లు వచ్చే ఛాన్సు లేదు కానీ.. ఒక వేళ వస్తే పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా మొదలైంది. ఒక వేళ ఇదే జరిగితే.. ప్రపంచం రెండుగా చీలినా ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకూ అమెరికాతో ఉన్న దౌత్య, వాణిజ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తింటాయి. అంతే కాదు ఇకపై వాషింగ్టన్ పై ఆధారపడే దేశాలు కాస్తా.. ఢిల్లీ, మాస్కో, బీజింగ్ వైపు చూస్తాయి. దీంతో పెద్ద ఎత్తున అమెరికా వ్యాపారులు, వినియోగదారులు నష్టపోతారు. అంతేకాదు ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వంటి యూఎస్ సెక్టార్స్ లో ద్రవ్యోల్బణం వస్తుంది. దీంతో అమెరికా తీవ్ర నష్టాల పాలు అవుతుంది. అయితే ఇక్కడే భారత పెట్రోలియం మంత్రి హర్ దీప్ సింగ్ పురీ.. ఇదంతా ప్రపంచానికే మేలు చేసేదని అన్నారు. తాము రష్యా నుంచి చీపుగా పెట్రోలు కొనడం వల్ల.. ప్రపంచ పెట్రోలు ధరలు నియంత్రణలో, అందుబాటులో ఉన్నాయని.. అదే రష్యా రోజుకు ఉత్పత్తి చేసే 9 మిలియన్ బ్యారళ్ల చమురు అలాగే నిలిచి పోతే.. ఆ మేరకు ఈ చమురు ఇతరుల నుంచి కొనాల్సి వస్తుంది. తద్వారా.. చమురు ధరలు బ్యారల్ కి 120 నుంచి 130 డాలర్లకు పెరుగుతుంది, కాబట్టి తాము చేసింది సరైన పనే అన్నారు కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పురి. ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయమేంటంటే.. చమురు ధరలపై ఆంక్షలున్నాయి కానీ చమురు కొనాలా వద్దా అన్న కోణంలో ఆంక్షలు విధించలేదని అంటారు మన కేంద్రమంత్రి. అయితే ఈ విషయంపై రష్యా స్పందిస్తూ.. ఇలాంటి బిల్లులు అమెరికన్ కాంగ్రెస్ పాస్ చేస్తే.. ఇక ఆ దేశాన్ని ఎవ్వరూ కాపాడలేరని అంటోంది. అంతే కాదు.. ఉక్రెయిన్ కి తాము సైనిక సాయం చేస్తామని అమెరికా ప్రకటించినంతనే రష్యా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు చేసి ఉక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అంటే యూఎస్ ఎంత రష్యాను కట్టడి చేయాలని చూస్తే ఆ దేశం మరింత రెచ్చిపోతుంది. ఈ విషయం ఇప్పటికే రుజువైంది. అయినా రష్యాతో గొడవ ఉంటే ఆ దేశంతో చూసుకోవాలి. కానీ ఇలా ఇతర దేశాల మీద ప్రతాపం చూపిస్తామనడమేంటి? భారత్ -పాక్ మద్య సత్సంబంధాలు లేవు. అయినా అలాంటి పాక్ అమెరికా అక్కున చేర్చుకుని సహకారం అందించడం లేదా? అలాగే పాక్ కి డ్రోన్ సాయం చేసిన టర్కీకి ఆఫర్లు ప్రకటించలేదా? అమెరికా చేస్తే నీతి పక్కనోళ్లు చేస్తే ద్రోహమా? అంటూ అమెరికన్ విధానాలను దుమ్మెత్తి పోస్తున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.
http://www.teluguone.com/news/content/america-president-donald-trump-temperament-25-201855.html





