భారతీయులకు ఉద్యోగాలివ్వొద్దు.. ట్రంప్ కామెంట్ల కాక
Publish Date:Jul 25, 2025
Advertisement
హలో ట్రంప్ ఎక్స్ క్యూజ్ మీ.. మీ దేశంలో మా వాళ్ల పనితీరుకు ఆయా కంపెనీలు ఏం రేంజ్ లో లాభాల బాటలో ఉన్నాయో తెలుసా.. తెలియకపోతే ఒక్కసారి ఈ వివరాలను చూడండి. 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోగా పని చేస్తున్నారు సత్య నాదేళ్ల. హైదరాబాద్ లో జన్మించిన ఆయన మైక్రో సాఫ్ట్ ను క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ లీడర్ గా తీర్చి దిద్దారు. ఒకప్పుడు 300 బిలియన్ డాలర్లు గల ఈ సంస్థను 3 ట్రిలియన్ డాల్లకు పైగా పెంచారు. మణిపాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్శిటీ నుంచి ఎంఎస్, చికాగో యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. తన శక్తి సామర్ధ్యాలన్నిటినీ ఉపయోగించి సత్యా నాదెళ్ల మైక్రోసాఫ్ట్ ని ఒక మహా వృక్షంగా విస్తరింప చేసిన పేరు సాధించారు. గుగుల్ సీఈవోగా మోస్ట్ పాపులర్ అయిన సుందర్ పిచాయ్.. 2015 నుంచీ ఈ సంస్థ కోసం పని చేస్తున్నారు. చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లో సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. అంతకు ముందు గుగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ కి నాయకత్వం వహించారు. ఐఐటీ ఖరగ్ పూర్, స్టాన్ ఫోర్డ్, వార్టన్ నుంచి పట్టభద్రులైన సుందర్ పిచాయ్.. సారథ్యం వహిస్తున్న సంస్థ ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లకు పైగా టర్నోవర్ కలిగి ఉంది. ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్ మ్యాప్స్ ని చూస్తూ వాహనాలను నడుపుతున్నాం అంటే అదంతా సుందర్ పిచాయ్ ఐడియానే. ప్రస్తుతం ఆల్ఫాబెట్ యాజమాన్యంలో ఉన్న యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ 2023 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. సుమారు 182 బిలియన్ డాలర్ల టర్నోవర్ గల ఈ సంస్థకు నీల్ మోహన్ సారథ్యం ఎంతో ప్రయోజనకరంగా మారింది. గతంలో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ గానూ పని చేశారీ ఇండో అమెరికన్. ఈ ప్లాట్ ఫామ్ ని కమర్షియల్ గా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషించారు. దీంతో ఆయనకు నాయకత్వ బాధ్యతలను అప్పగించిందీ సంస్థ. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ రేష్మా కేవల్ రామణి 2020 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ బయో టెక్నాలజీ సంస్థ 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉంది. ముంబైలో జన్మించిన రేష్మా బోస్టన్ లో వైద్య శాస్త్రంలో డిగ్రీ తీస్కున్నారు. జన్యు, కణ చికిత్సలను డెవలప్ చేస్తున్న యూఎస్ బేస్డ్ బయోటెక్ సంస్థకు తొలి మహిళా చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా రికార్డు సృష్టించారు రేష్మా కేవల్. ఇక కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్.. 2023 నుంచి ఈ సంస్థ సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 19 బిలియన్ డాలర్ల ఆదాయం గల ఈ సంస్థను ఇండో- అమెరికన్ అయిన రవి పరుగులు పెట్టిస్తున్నారు. ట్రాన్స్ యూనియన్ లో ఇండివిడ్యువల్ డైరెక్టర్ గానూ వర్క్ చేస్తున్నారు. అరిస్టా నెట్ వర్క్స్ సీఈఓ అయిన జయశ్రీ ఉల్లాల్ 2008 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. 90 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ గల ఈ సంస్థకు సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు జయశ్రీ. ఈమె భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ అమెరికన్ కావడం విశేషం. అరిస్టాను క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలుపుతున్నారీమె. వేఫర్ సీఈఓ నీరాజ్ షా.. 2002లో స్థాపించిన ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులు కూడా. ఈ కామర్స్ లో ఫర్నిచర్, గృహోపకరణాల్లో 12 బిలియన్ డాలర్ల ఆదాయం ఈ సంస్థ సొంతం. ఇండో అమెరికన్ అయిన షా, వేఫర్ ను గృహోపకరణాల విభాగంలో ప్రముఖ ఆన్ లైన్ రీటైలర్ గా నిర్మించారు. ఫెడెక్స్ సీఈఓ రాజ్ సుబ్రహ్మణ్యం 2022 నుంచి ఈ సంస్థ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. లాజిస్టిక్స్ లో ఈ సంస్థ 90 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది. ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ అయిన రాజ్ ఫెడ్ ఎక్స్- ప్రపంచ వ్యాప్త విస్తరణపై తనదైన ముద్ర వేశారు. గోడాడీ సీఈఓ అమన్ భూటానీ 2019 నుంచి ఈ సంస్థ సారధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ విశ్వ విద్యాలయం, లాంకాస్టర్ వర్శిటీ నుంచి డిగ్రీలను పొందిన భూటాని వెబ్ హోస్టింగ్, డొమైన్ రిజిస్ట్రేషన్ లో గోడాడి విస్తరణకు నాయకత్వం వహిస్తున్నారు. అమన్ నాయకత్వంలోని ఈ సంస్థ 4 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగి ఉంది.
ఇక ఇంటర్నేషనల్ బిజినెస్ మిషీన్స్.. షార్ట్ ఫామ్ లో చెబితే.. ఐబీఎం కార్పొరేషన్ సీఈవో అరవింద్ కృష్ణ.. ఇల్లినాయిస్ యూనివర్శిటీ నుంచి పీహెచ్డీ పొందారు. ఈ ఐఐటీ కాన్పూర్ విద్యార్ధి సారథ్యంలో నడుస్తోన్న ఐబీఎం ప్రస్తుత టర్నోవర్ 244 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులోని రెడ్ హ్యాట్ టర్నోవర్ 34 బిలియన్లు. ఇందుకు సారథ్యం వహించింది కూడా అరవిద్ కృష్ణే. అంతే కాదు హైబ్రిడ్ క్లౌడ్, ఏఐ పైనా దృష్టి సారించి ఈ దిశగా కంపెనీ ముందుకు వెళ్లేందుకు నాయకత్వం వహిస్తున్నారు అరవింద్ కృష్ణ.
అడోబ్ సీఈవో శంతను నారాయణ్. 2007 నుంచి ఈ సంస్థకు సారధ్యం వహిస్తున్నారు. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ 2024 నాటికి 250 బిలియన్ డాలర్లు. హైదరాబాద్ లో జన్మించిన నారాయణ్ అడోబ్ ని సబ్ స్క్రిప్షన్ ఆధారిత మోడ్ లోకి మార్చారు. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ లో అగ్రగామిగా నిలిచిందంటే ఇదంతా శంతను ఆలోచనల వల్ల మాత్రమే సాధ్యమైందని అంటారు. ఉస్మానియా, బౌలింగ్ గ్రీన్ స్టేట్, బర్కిలీ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందిన ఈయన తన సంస్థ అంచెలంచలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు.
మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మల్హోత్రా.. 2017 నుంచి సంజయ్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ గా పని చేస్తున్నారు. ఈ సంస్థ ఆదాయం 21 బిలియన్ డాలర్లు. బిట్సి పిలానీ, యూసీ బర్కిలీ గ్రాడ్యుయేట్. శాన డిస్క్ సహస్థాపకులైన సంజయ్.. సెమికండక్టర్ మెమరీలో మైక్రాన్ ని ముందుండి నడిపిస్తున్నారు.
పాలో ఆల్టో నెట్ వర్క్స్ సీఈవో నికేష్ అరోరా.. 2018 నుంచి ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. 2024 నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ సంస్థ సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా ఉంది. ఐఐటీ వారణాశి, బోస్టన్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన అరోరా.. గతంలో గూగుల్, సాఫ్ట్ బ్యాంక్ లో సీనియర్ పొజిషన్లో వర్క్ చేశారు. పాలో ఆల్టో సైబర్ సెక్యూరిటీ పోర్ట్ ఫోలియోని మరింత బలోపేతం చేశారు.
వీళ్లే కాక ఇక మీ స్సేస్, సాఫ్ట్ వేర్, మెడికల్, లా, తదితర రంగాల్లో గల భారతీయుల ప్రతిభిపాటవాల విలువ అమెరికాకు లక్ష కోట్ల మేర ఉంటుంది. అంతేనా భారతీయులు అమెరికాకు పన్ను కట్టే వారి పర్సంటేజీలో 1. 5 శాతం వరకూ ఉన్నారు. ఇక్కడున్న కుల-మత-వర్గ- వైషమ్యాలనే బాధలు పడలేక అక్కడికి వలస వచ్చిన మావాళ్లు.. మీ దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారు. వాళ్లే లేకుంటే మీ సంస్థల ఆర్ధిక పటుత్వం నేల చూపులు చూసే అవకాశముంది. ఐడియా ఎవరైనా ఇస్తారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలోనే ఉంటుంది అసలు సత్తా. ఆ సత్తాగల భారతీయులు లేకుంటే మీ గతి అధోగ తే అన్నది పలువురు అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు అంటోన్న మాట.
http://www.teluguone.com/news/content/america-financial-pillers-indians-39-202698.html





