బూతు పురాణంలో హద్దులు దాటేసిన అంబటి!
Publish Date:Jan 31, 2026
Advertisement
వైసీపీ ఎకో సిస్టమ్ లోనే మర్యాదా, మన్నన వంటి వాటికి అవకాశం లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నానితో మొదలు పెడితే పలువురు నేతలు నిత్యం తమ బూతుల కారణంగానే వార్తలలో ఉండేవారంటే అతిశయోక్తి కాదు. సరే వైసీపీ 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలవ్వడం, బూతు పురాణంతో డిఫేమ్ అయిన నేతలు ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవకపోవడం తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీయులు దాదాపుగా నోరు కట్టేసుకున్నారు. కేసుల భయమైతేనేం.. జనం నోరు జారితే ఇక ఊరుకోరన్న బెరుకు అయితేనేం.. నోరు తెరిస్తే దూషణలు వినా మరోకటి మాట్లాడటం చేతగాని కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారంతా సైలెంట్ అయిపోయారు. వైసీపీ కార్యక్రమాలలో కూడా పెద్దగా కనిపించకుండా దాదాపు రహస్య జీవితం గడుపుతున్నారా అన్న అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు మాత్రం ఆ బూతు పురాణం విషయంలో అన్ని హద్దులూ దాటేశారు. సభ్య సమాజం సహించని భాషతో చంద్రబాబుపై రెచ్చిపోయారు. వివరాలలోకి వెడితే.. తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు చేపట్టిన సిట్.. తాజాగా సుప్రీం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ చార్జిషీట్ నుంచి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్టులో సిట్ దాఖలు చేసిన చార్జి షీట్ లో లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్ స్పష్టం చేసిందంటూ నానా హడావుడీ చేస్తోంది. కల్తీ జరిగిందని సిట్ పేర్కొన్న విషయాన్ని కన్వీనియెంట్ గా విస్మరిస్తూ జంతువుల కొవ్వు లేదని సిట్ పేర్కొందంటూ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లు అవాస్తవ ప్రచారం, ఆరోపణలు చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలోనే తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగేలా తెలుగుదేశం వ్యవహరిం చిందంటూ ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో పూజల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే శనివారం (జనవరి 31) గుంటూరు గురజాలలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఆ సందర్బంగా అయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి సభ్య సమాజం సహించని రీతిలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించారు. అంబటి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/ambati-crossed-all-borders-25-213303.html





