జగన్ మావిగన్....బొత్స అమరావతి... రెండంచల వ్యూహమేంటి?
Publish Date:Apr 6, 2026
Advertisement
అమరావతికి తాము కట్టుబడి లేమంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనక సారమేంటి? అయితే వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టా? వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఎంత మేరకు ఉండనుంది? అని పరిశీలిస్తే.. మాజీ మంత్రి, వైసీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత, బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే రేపాయి. ఈ కామెంట్లతో పాటు జగన్ కామెంట్లనూ కలిపి కొత్త సమీకరణాలను తెరపైకి తెస్తున్నారు కొందరు. మొదట బొత్స చేసిన తాజా వ్యాఖ్యలు ఎలాంటివని గమనిస్తే.. వైసీపీ తొలి నుంచి కేవలం ఒక్క ప్రాంతంలోనే అంటే అమరావతి లోనే వేల కోట్ల పెట్టుబడి పెట్టడం వల్ల రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు వెనకబడి పోతాయన్నది వీరి వాదనగా తెలుస్తోంది. దీనర్ధం ఏంటని చూస్తే.. అమరావతి పట్ల ఉన్న విముఖత కంటే, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రయోజనాలే ముఖ్యమనే సంకేతాన్ని పంపాలని భావిస్తోంది వైసీపీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అమరావతి నిర్మాణం ఒక సాధ్యం కాని గ్రాఫిక్స్ ప్రాజెక్ట్ అని ప్రజల్లో ముద్ర వేయడం కూడా ఇందులో ఒక భాగంగా తెలుస్తోంది. ఇక వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉందా? అని గమనిస్తే.. అవును, వైసీపీ తన మూడు రాజధానుల నినాదానికే కట్టుబడి ఉందని స్పష్టమవుతోందని అంటున్నారు పులువురు రాజకీయ నిపుణులు. గతంలో ప్రభుత్వం వెనక్కి తీసుకున్న బిల్లును మరింత పకడ్బందీగా మళ్ళీ తీసుకురావాలనేది వీరి ఆలోచనగా తెలుస్తోంది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో పట్టు పెంచుకోవాలని, హైకోర్టు ద్వారా కర్నూలులో రాయలసీమ సెంటిమెంట్‌ను బలోపేతం చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది వైసీపీ. ఓవరాల్ గా చూస్తే.. అమరావతి కేవలం ఒక శాసన రాజధానిగా మాత్రమే ఉండాలని వారు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం ఎంత వరకు ఉండనుంది? అని విశ్లేషిస్తే.. ఈ అంశం వచ్చే ఎన్నికల్లో రెండు వైపులా పదునైన కత్తి లాంటిదని అంచనా వేస్తున్నారు. విశాఖను రాజధాని చేస్తామనే నినాదం.. ఉత్తరాంధ్రలో సానుకూలంగా మారే అవకాశం ఉంది. అయితే, భూముల వివాదాలు ప్రతికూలత తెచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇక కర్నూలు న్యాయ రాజధాని అంశం కొంతవరకు కలిసిరావచ్చు, కానీ సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ ప్రధాన సమస్యగా మారొచ్చు. కోస్తా ఆంధ్ర మరీ ముఖ్యంగా.. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అమరావతిపై వ్యతిరేక వ్యాఖ్యలు ఈ ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చు. రైతుల ఆందోళనలు, మధ్యతరగతి వర్గాల ఆగ్రహం ఎన్నికలపై పడే అవకాశం ఉందన్నది ఒక అంచనా. వైసీపీ ఈ అంశాన్ని పేదలు vs ధనికులు లేదా వికేంద్రీకరణ vs కేంద్రీకరణ అనే కోణంలోకి మళ్లించాలని చూస్తోంది. కానీ, అమరావతికి భూములిచ్చిన రైతుల సెంటిమెంట్, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మధ్య సమతుల్యం సాధించడం ఆ పార్టీకి పెద్ద సవాలుగా మారనుంది. కూటమి పార్టీలు అమరావతిని ప్రధాన అజెండాగా మార్చిన పరిస్థితుల్లో, ఈ రాజధాని యుద్ధం ఎన్నికల ఫలితాలను శాసించే కీలక అంశం కానుంది. అయితే ఇక్కడ గుర్తించాల్సినదేంటంటే.. మరీ అంత ఉత్కంఠ భరితంగా ఎదురు చూడాల్సిన అవసరముందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు కొత్తదేం కాదు. అంతా పాతదే. జగన్ ప్రస్తావించిన మావిగన్ అయినా కాస్త డిఫరెంట్ గా ఉందేమోగానీ.. బొత్స చేసిన రీసెంట్ కామెంట్ అమరావతి శాసన రాజధాని- అన్నది బాగా పాతది. పైపెచ్చు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చుతామని ప్రకటించడం మాత్రమే కాదు.. ఇక్కడ రుషి కొండ వ్యాలీలో బంగళా నిర్మించుకున్న జగన్ కి దక్కిన సీట్లు ఓట్ల సంగతి తెలిసిందే. విశాఖ గాజువాక నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచింది టీడీపీ. ఉత్తరాంధ్ర మొత్తం, రాయలసీమ మొత్తం కలిసి గత 2024 ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్ల సంఖ్య ఎంత? అని చూస్తే..శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో- కేవలం 2 అంటే రెండు సీట్లు రాగా.. కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాలు గల రాయలసీమ మొత్తం కలిపితే వచ్చిన సీట్లసంఖ్య- 7. ఈ రెండు ప్రాంతాలు కలుపుకుంటే.. 86 సీట్లకుగానూ 9 సీట్లను సాధించగలిగింది గత ఎన్నికల్లో వైసీపీ. అయితే జగన్ వ్యూహం మరోలా ఉన్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలోని 175 సీట్లు కాస్తా 263 సీట్లు కానుండటంతో.. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకుగానూ ఈ సంఖ్య 86 నుంచి ఎంతకు మారనుందని చూస్తే.. ఉత్తరాంధ్ర- 34 సీట్లు కాస్తా 51కి, 52 సీట్ల రాయలసీమ- కాస్తా 78కి పెరగనున్నాయి. టోటల్ గా 86 సీట్ల ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లోని సీట్లు 129కి పెరగనున్నాయి. కృష్ణా, గుంటూరు వదిలేస్తే.. మిగిలిన ఉభయ గోదావరి, నెల్లూరు వంటి జిల్లాల్లో కొంత మేర రాణించినా మ్యాజిక్ ఫిగర్ 132 సీట్లు కొల్లగొట్టడం అవలీలగా భావిస్తోంది వైసీపీ యంత్రాంగం. అలాగని ఈ జిల్లాలను పూర్తిగా వదిలేయకుండా మావిగన్ స్కెచ్ వేసిన వైసీపీ.. అలాక్కూడా కవర్ చేసే యత్నం చేస్తోంది. ఈ రెండంచల వ్యూహంతో వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది. ఈ టార్గెట్ తో వచ్చే ఎన్నికలకు వెళ్లేలా తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో కూటమి తమ వ్యూహం మార్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి.. ఆంధ్రప్రజల నాడి ఎటు వైపునకు మొగ్గుతుందో అన్న మాట వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/amaravati-36-216765.html





