ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీజేపీ?!
Publish Date:Jan 14, 2023
Advertisement
హిందుత్వ అజెండాను పూర్తిగా హైజాక్ చేసిన భజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కు చెక్ పెట్టి భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పకడ్బందీ ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న మోహన్ భాగవత్ పనితీరుపై భజరంగ్ దళ్ లోని కొందరు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అందుకే మోహన్ భగవత్ ఆమధ్య కొందరు ముస్లిం నేతలతో కలిసినప్పుడు, ఓ మసీదుకు వెళ్లినప్పుడు భారీగా ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగింది. ఇందులో భజరంగ్ దళ్ తోపాటు బీజేపీ వాళ్లు కూడా కీలక పాత్ర పోషించారనే విషయం ఒకింత ఆలస్యంగానైనా బయటపడింది. అందుకే బీజేపీయే స్వయంగా భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ల మధ్య ఎడాన్ని పెంచుతోందన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. అలా ఎందుకు అన్న ప్రశ్నకు.. బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న సమాధానం వస్తోంది. ఎందుకంటే.. పార్టీలో తిరుగులేని నాయకుడిగా మోడీ, ఆయనకు గట్టి మద్దతుదారుగా అమిత్ షా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నట్లు పైకి కనబడుతున్నా.. పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్ అన్న చందంగా.. సైద్ధాంతిక సారూప్యతతో సంబంధం లేకుండా ఓట్లు, సీట్లు చాలు అన్న చందంగా అన్ని పార్టీల నుంచీ బీజేపీలోకి వలసలను ప్రోత్సహిస్తోంది మోడీషా ద్వయం. దీంతో బీజేపీలో లుకలుకలూ పెరుగుతున్నాయి. అదనంగా గ్రూపుల సంస్కృతీ వచ్చి తోడైంది. ప్రస్తుతం ఇటు బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగులేని గుర్తింపు, ప్రజాదరణ, కరిష్మా, ఇమేజ్ వంటివన్నీ ఉన్నాయి. ఆయనకు పోటీగా ఇటు సొంత పార్టీలో అటు ప్రతిపక్షాల్లో నిలబడ సత్తా ఉన్న నాయకుడు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏడాది కాబట్టి ప్రతి అంశాన్ని సంతృప్తి పరిచేలా, అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ను విస్తరించనున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో న హ్యాట్రిక్ విజయానికి దోహదపడే విధంగా కేబినెట్ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు. కసరత్తు చేస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీలో ఏ నేతకు ప్రజాదరణ ఉంది, ఎవరెవరికి ప్రమోషన్ వస్తుంది. ఎవరికి ఉద్వాసన కలుగుతుంది, పార్టీ బాధ్యతలు దక్కేదెవరికి, కేంద్ర మంత్రి పదవులు దక్కేదెవరికి, ఏ బీజేపీ సీఎంకు మోడీ-షా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు లాంటి ఉహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. బీజేపీలో మోడీషా ద్వయం కరుణాక్ష కటాక్ష వీక్షణాలు ఎప్పుడు ఏ విధంగా ఎవరి మీద ప్రసరిస్తాయో చెప్పే తార్కిక అంశం ఏదీ ఉండదు. ఆ ద్వయం ఎప్పుడు, ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అంతుపట్టదు. మోడీషా కన్నుసన్నల్లో మెదులుతూ, వారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొందిన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పడు వారి గుడ్ సెల్వ్స్ లో లేరని పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది. సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా రెండవసారి పార్టీని అధికారంలోకి రాకపోవడానికి నడ్డాయే కారణమన్న ముద్ర వేసి ఆయనపై వేటు వేయడానికి మోడీ షా ద్వయం సిద్ధంగా ఉందని గట్టిగా వినిపిస్తోంది. అసలు హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా ఒకే పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన సందర్భం ఎప్పుడూ లేదు. అయినా ఆ రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడంలో వైఫల్యానికి నడ్డాను బాధ్యుడిని చేస్తున్నారు. సొంత రాష్ట్రంలో రెబెల్ లీడర్స్ ను కట్టడి చేయటంలో నడ్డా పూర్తిగా విఫలమయ్యారు. చివరికి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్తలను బుజ్జగించాల్సన పరిస్థితి వచ్చిందన్నది బీజేపీలో ఒక వర్గం వారి ఆరోపణ. మరి మోడీ బుజ్జగింపులు కూడా పని చేయలేదా అన్న ప్రశ్నకు మాత్రం ఎవరూ బదులు చెప్పరు. నడ్డా పదవీ కాలం ముగియడగానే ఆయన స్థానంలో కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించడం ఖాయమని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ నెల 30తో జేపీ నడ్డా పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో పార్టీలో, ప్రభుత్వంలో గట్టిపట్టున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. ఇక జేపీ నడ్డాకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని అంటున్నారు. మోడీ-షా ఇప్పటికే ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని పార్టీలో ఓ స్థాయి ఉన్న నేతలనందరినీ పక్కన పెట్టేశారు. పూర్తిగా తమకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకునే క్రమంలో కొత్త వారిని తెరపైకి తెచ్చి, బాధ్యతలు కట్టబెట్టి.. వారితోనే పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతూ.. కొత్త తరం నేతలను తయారు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. మరో సీనియర్ నేత నితిన్ గడ్కరీ పరిస్థితి కూడా చాలా గందరగోళంగా తయారైంది. కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గడ్కరీని తప్పించటం ఆయనను అవమానానికి గురిచేసింది. కానీ ఆర్ఎస్ఎస్ అండదండల కారణంగా ఆయన సైలెంట్ గా ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గడ్కరీ స్థానంలో మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎదిగినట్టు అనుకునేలా సంఘ్ పరివార్, బీజేపీ ప్రవర్తిస్తోంది. సరే పార్టీని, సంఘ్ పరివార్ నూ పూర్తిగా తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకున్న మోడీషా ద్వయానికి ఎన్నికలకు మించి చాలెంజ్ ఏమిటంటే.. మరో 3 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీకి 5 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. మరి అప్పుడు ఆయన రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తారా? అద్వానీ, మురళీ మనోహర్ జోషిల్లా ఆయన కూడా మార్గదర్శక మండలికి పరిమితమైపోతారా? లేకపోతే తమ కోసం తామే తీసుకు వచ్చిన వయోపరిమితి నిబంధనను మోడీ షా ద్వయం మళ్లీ తమ కోసమే సవరిస్తారా? ప్రస్తుతం మోడీ హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అన్న దాని కంటే మూడేళ్ల తరువాత వయోపరిమితి నిబంధనను తనకు వర్తింప చేసుకుంటారా అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇప్పటికిప్పుడు అయితే పైకి అంతా బానే కనిపిస్తున్నా.. వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న వాతావరణమే ఉందని పరిశీలకులు అంటున్నారు. గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, వసుంధరరాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, యెడ్డియూరుప్ప వంటి వారంతా ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నా మోడీషా ద్వయం వైఖరి పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారన్నదే పరిశీలకుల విశ్లేషణ.
http://www.teluguone.com/news/content/all-is-not-well-in-bjp-39-150009.html





