ఎరువుల కోసం రైతుల తిప్పలు.. అధికారుల నిర్లక్ష్యంతో తప్పని అవస్థలు
Publish Date:Jul 5, 2025
Advertisement
తెలంగాణలో రైతాంగం అవస్థలు వ్యవసాయ అధికారులకు పట్టడం లేదు. ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ అధికారులకు ముందు చూపు కొరవడటంతో అన్నదాతలు అవస్థలు పడున్నారు. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంట అదును దాటుతున్నా.. సరిపడా యూరియా సరఫరా చేయడంలో విఫలమైన అధికారుల తీరును దుయ్యబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుల్లపెల్లి లోని రైతులు గంటల తరబడి ఎరువుల కోసం క్యూలైన్ లో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా నిలబడే ఓపిక లేక తమ చెప్పులను క్యూలైన్ లో వదిలేసి పక్కకు వెళ్లి కూర్చుంటున్న దుస్థితి కళ్లకు కడుతోంది. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సాగుచేసిన మక్కజొన్న వంటి పంటలకు మందు వేసే సమయం ఆసన్నమైనా యూరియా కొరత పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన రైతాంగంలో వ్యక్తం అవుతోంది. దీంతో రైతాంగం. యూరియా కోసం సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు లైన్లో పెట్టి పొద్దంతా పనులు మానుకుని వేచి ఉంటున్నారు. అయినా వారికి ఒకటి, రెండు సంచులకు మించి యూరియా దొరకడం లేదు. ఆ అరకొర సరఫరా వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోతోందని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సహకార శాఖ అధికారుల మాయాజాలానికి తోడు వ్యవసాయశాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందంటున్నారు. ఒకవైపు ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతుంటే, మరోవైపు అసలు కొరతే లేదని యంత్రాంగం చెబుతుండడం విడ్డూరంగా ఉంది.
http://www.teluguone.com/news/content/agricultural-officers-negligence-lead-farmers-suffer-25-201349.html





