అమరావతి రైతుల ఉద్యమానికి కొండంత అండ అడ్వకేట్ మురళీధర్‌రావు
Publish Date:Aug 2, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? అన్నది 2019 సంవత్సరం నుంచి నిన్నమొన్నటి వరకు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రస్తుతం ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇటీవల బడ్జెట్ లో అమరావతి రాజధానికి రూ. 15000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వీరి సంతోషం వెనక ఐదేళ్లలో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. కన్నీటి గాధలు ఉన్నాయి. కంటి నిండా సరిగా నిద్రపోయిన రోజులు తక్కువనే చెప్పొచ్చు. ఇందుకు కారణం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఏపీ రాజధాని అమరావతి కాదని.. మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమించారు. ఈ క్రమంలో రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు.. వైసీపీ మూకల రాళ్ల దెబ్బలు తిన్నారు. అయినా వెనక్కు తగ్గలేదు. మరోవైపు అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు రైతులు కోర్టులను ఆశ్రయించారు. రైతుల తరుపున కోర్టుల్లో వాదనలు వినిపించి వారికి అండగా నిలిచారు హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ ఉన్నం మురళీధర్ రావు. కోర్టుల్లో వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంపై ఆయన సాగించిన పోరాటం అమరావతి ఉద్యమ ఘట్టంలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు. హైకోర్టులో కేసులు వాదించడంకోసం రోజుకు లక్షల్లో ఫీజు వసూళ్లు చేయగల సామర్థ్యం కలిగిన లాయర్ ఆయన. అయితే, అమరావతి రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటంలో మురళీధర్ రావు వారికి అండగా నిలబడ్డారు. అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అంటూ రైతుల తరపున హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించారు. హైకోర్టులో రైతుల తరపున వాదనలు వినిపించినందుకు ఆయన ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. కోర్టుల్లో ప్రభుత్వం కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ రైతులు తమ పోరాటంలో విజయం సాధించడంలో తనవంతు పాత్రను మురళీధర్ రావు సమర్థవంతంగా పోషించారు. సత్యం, న్యాయం, ధర్మం రైతుల వైపు ఉన్నాయి.. చివరికి అవే గెలుస్తాయని మురళీధర్ రావు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో విశాఖ పట్టణానికి రాజధాని తరలిపోకుండా ఎప్పటికప్పుడు కోర్టుల ద్వారా స్టేలు తీసుకొస్తూ ప్రభుత్వం దూకుడుకు మురళీధర్‌రావు బ్రేక్ లు వేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతీయేటా కౌలు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆ కౌలును కూడా చెల్లించలేదు. దీంతో రైతు పరిరక్షణ సమితి, రైతు సమాఖ్య తరపున దాఖలైన పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంలో.. ఈ పిటీషన్‌లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ వాదనలపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో రైతులకు కౌలు చెల్లించాలని వేసిన పిటీషన్‌లకు విచారణ అర్హత ఉందని కోర్టు స్పష్టం చేయడంతో ప్రభత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సీఎం చంద్రబాబు రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఏటా ఇస్తున్న కౌలును అంతే మొత్తం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎలాగూ వచ్చే ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణం కొనసాగడం ఖాయం కాబట్టి ఈ ఐదేళ్లలో వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కౌలు గడువును మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం పెంచనుంది. అమరావతి రాజధానిని కాపాడుకునేందుకు రైతులు పాదయాత్ర ద్వారా పోలీసుల లాఠీలకు ఎదురెళ్లి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తే.. అడ్వకేట్ ఉన్నం మురళీదర్‌రావు ఎప్పటికప్పుడు కోర్టుల ద్వారా ప్రభుత్వం కుట్రలను అడ్డుకుంటూ రైతుల పోరాటానికి కొండంత అండగా నిలిచారు. జగన్ ప్రభుత్వం కుట్రల నుంచి అమరావతి రాజధానిని కాపాడుకోవటంలో రైతుల పోరాటాన్ని ప్రజలు ఏ విధంగా గుర్తుచేసుకుంటున్నారో.. కోర్టుల ద్వారా మురళీధర్ రావు పోరాటంపైనా అదేస్థాయిలో ప్రజలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇటీవల అడ్వకేట్ ఉన్నం మురళీధరరావుకు అమెరికా పర్యటనకు వెళ్లగా.. వాషింగ్టన్ డీసీలో ప్రవాసులు ఘనంగా సత్కరించారు. అమరావతి రైతుల పోరాటాన్ని, వారికి అండగా నిలుస్తూ కోర్టుల్లో మురళీధర్ రావు సాగించిన పోరాటాన్ని ప్రవాసులు కొనియాడారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు మురళీధర్ రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఉద్యమంలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
http://www.teluguone.com/news/content/advocate-muralidharrao-strong-support-amarawati-39-182131.html





