అసాధ్యాలను సుసాధ్యం చేసే దార్శనికుడు.. అనితర సాధ్యుడు.. నారా చంద్రబాబునాయుడు
Publish Date:Apr 19, 2026
Advertisement
భూమ్మీదకు ఎంతోమంది వస్తూ ఉంటారు. జన్మభూమి కోసం వచ్చేవారు కొందరుంటారు. వారిలో చంద్రబాబు ఉంటారు. ఒక మనిషి వయస్సును కొలవటానికి సంవత్సరాలే కొలమానం అయితే.. చంద్రబాబు డెబ్బై అయిదు వసంతాలను దాటి డెబ్బై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. గత యాభై సంవత్సరాలుగా ఆయన వార్తల్లో వ్యక్తి. ఆయన గురించి ఇప్పటికీ అర్థం కాని విషయం.. ఒక ఎగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అంతటి సాహసోపేతమైన కలలు ఎలా కన్నారు? ఆయన కుటుంబ నేపథ్యం ఆయనను చదివించటానికి సరిపోతుంది కానీ, ఆయన రాజకీయాలలో ఎదగడానికి ఖర్చు పెట్టగలిగే శక్తివంతమైనది కాదు. ఈ రోజుల్లో మాదిరి శాసనసభ్యుడు కావాలంటే కోట్లు అవసరం ఉండి ఉండకపోవచ్చు, కానీ అస్సలు డబ్బులు ఖర్చు పెట్టకుండా శాసనసభ్యుడు అవటం ఆ రోజుల్లో కూడా అసాధ్యమే. కానీ తన రాజకీయ భవిష్యత్ గురించి చంద్రబాబు కలకనటమే కాకుండా.. సాకారం చేసుకోవటానికి కృషి చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ గా రూపొందించినట్లే, ఆయన రాజకీయ రంగప్రవేశంలో కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీం ఏదో ఆలోచించి అమలులో పెట్టి ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తన ప్రసంగాలను మనం చేయలేమా? చేయగలం (యస్ వికెన్) అనే మాటతో ముగించేవారు. కానీ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల క్రితమే తన జీవితానికి నేను చేయగలను (ఐ కేన్ డూ) అనే టాగ్ లైన్ నిర్దేశించుకున్నారు. పార్టీ నిర్మాణంలో, అంచలంచెల నాయకత్వ విధానంలో కమ్యూనిష్టులను అనుకరించే చంద్రబాబు, అనుసరించేది పెట్టుబడిదారీ వ్యవస్థను. ఆయన ఐడియాలను పెట్టుబడిగా పెట్టి పెట్టుబడిదారులను ఆకర్షిస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థ రూపురేఖలు ఎలా అల్లుకుపోతాయి అనే మాట పక్కన పెడితే.. రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పనే ఆయన లక్ష్యం. దార్శనికుడు అంటారు, అది నిజమే.. అలాగే అన్వేషణ ఆయన సహజగుణం. రేపు రాబోయే సమాజం ఎలా ఉంటుందో దర్శించగలగటం ఒకెత్తు.. ఆ సమాజానికి అవసరమైన పునాదులను అన్వేషించటం మరో ఎత్తూ.. ఈ రెండూ ఏకకాలంలో చేయగలగడమే చంద్రబాబు ప్రత్యేకత. ఇప్పటి ప్రపంచం తీరుతెన్నులకు తనను తాను మలచుకుంటాడు. ఆయన మీద ఉండే ప్రధానమైన విమర్శ కూడా అదేనేమో! అవసరాలకు అనుగుణంగా తన పార్టీ విధివిధానాలను, తన పాలనా తీరును మార్చుకోవటం అవకాశవాదం అయితే.. ఆయన ఖచ్చితంగా అవకాశవాదే. కానీ ఆయన నమ్మేది అవసరమే ఆవిష్కరణకు తల్లి. ప్రజల అవసరాలను తీర్చటమే తన విధానాల అన్వేషణకు మూలం అనుకుంటారు చంద్రబాబు. తన పార్టీ బతికి ఉండాలి, తన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనే ఆశయానికి అనుగుణంగా ఆయన అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. సమకాలీన రాజకీయాలలో ఆయన ఎప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోయారు. రేపు రాబోయే ఎన్నికలలో ఆయన ఎటువంటి స్టాండ్ తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. అప్పటి అవసరాలు ఎలా ఉంటాయో ఊహించే ప్రయత్నంలో ఇప్పటి సమయాన్ని వృధా చేసుకోవటం ఆయనకు ఇష్టం ఉండదు. దానికి ఎవరు ఏ పేరు పెట్టినా ఆయన లెక్క చేయరు. అయితే ఆయన ఆలోచనలు రాష్ట్ర అవసరాల మేరకే పరిమితమైపోయాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారే కానీ, దేశ విదేశీ విధానం గురించి ఆలోచించే ప్రయత్నం చేయరు. బహుశా సుదీర్ఘకాలం తన పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలతో జత కట్టించి ఉంచటం వలనేమో.. రాష్ట్రానికి ఆవల ఏమీ జరిగినా ఆయన పెద్దగా పట్టించుకోరు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా..
బహుశా అందుకేనేమో.. ఆయన జీవితమంతా అసాధ్యాలను సుసాధ్యం చేయటమే పనిగా పెట్టుకున్నారు. సవాళ్లను స్వీకరించటం ఆయన నైజం. అందుకే అప్పటికే మహామహులు నాయకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో.. చిత్తూరు జిల్లాలో పెద్దగా ప్రాధాన్యత లేని సామాజికవర్గం నుండి వచ్చిన ఆయన.. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబానికి చెందిన ఒక సామాన్యుడు శాసనసభకు ఎందుకు వెళ్ళలేడు? అనే సవాలును అతి పిన్నవయస్సులో స్వీకరించాడు. సామాన్యుడిగా వచ్చిన ఆయన ఈరోజు అసామాన్యతనే సామాన్యతగా రూపాంతరం చెందేలా చేయగలిగాడు. దానికి తార్కాణం చంద్రబాబు రాజకీయ ప్రస్థానమే కాదు, ఆయన నాయకత్వంలో ఎదిగిన తెలంగాణ.
ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలు ఆయనలోని దార్శనికుని చూస్తున్నాయి. కానీ.. దేశ రాజకీయాలలో ఆయన పాత్ర పరిమితం అయిపోయింది. ఇదే ఎన్డీయే వాజ్ పేయి నాయకత్వంలో పరిపాలన కొనసాగిగుతున్నప్పుడు.. దేశంలో మౌలిక వసతుల రూపకల్పన లాంటి విషయాలలో చంద్రబాబు తనదైన ముద్ర వేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక పిల్లర్ అయినా జాతీయ విధానాల రూపకల్పనలో ఆయన పాలుపంచుకోవటం లేదు. బహుశా మారిన రాజకీయ ముఖచిత్రంలో ఆయన తన పాత్రను రాష్ట్రం వరకే పరిమితం చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఇది దేశానికి నష్టం.
అయితే ఆంధ్రరాష్ట్రానికి ఆయన అవసరం ఎంత ఉన్నదంటే, ఆయన మరో డెబ్బై అయిదు వసంతాలు జరుపుకోవాలన్నంతగా! ఒకనాడు ఆయన ఐటీ వైపు మొగ్గు చూపినప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు అంతులేని భేదం ఉన్నది. ఐటీ సెక్టార్ నిరాటంకంగా పాతిక సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యమేలింది. ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఉద్యోగాలను తగ్గించటమే కాక, ఉన్న ఉద్యోగులనే తీసివెయ్యవలసిన పరిస్థితిని తీసుకువస్తున్నది. కొత్తగా వచ్చిన సాంకేతికత ఎంతకాలం మనుగడ సాగిస్తుందో ఎవరూ ఊహించను కూడా ఊహించలేకపోతున్నారు.
ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి, సాంకేతిక రంగానికి ఆవల కూడా ఉద్యోగ ఉపాధి కల్పన జరిగేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. వీటన్నిటికంటే మిన్నగా కుదేలయిపోయిన వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టాలి. వ్యవసాయాధారిత రాష్ట్రంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో, వ్యవసాయం అంతకంటే ముఖ్యం. ఇక చంద్రబాబు మానస పుత్రిక, ప్రజా రాజధాని అమరావతి ఉండనే ఉన్నది. చంద్రబాబు డెబ్బై ఏడవ జన్మదిన వేడుకల నాటికి అమరావతికి ఒక రూపం తీసుకువస్తేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. భిన్న కోణాల దిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వలనే సాధ్యం అనే విషయంతో ఎవరూ విభేదించలేరు. అందరికీ వయస్సు పెరిగే కొద్దీ బాధ్యతలు తగ్గుతాయి, కానీ సమస్యను సవాలుగా స్వీకరించేవారిపై బాధ్యతలు పెరుగుతాయి. అందుకని చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ఆయన బాధ్యతల భారాన్ని గుర్తుచేస్తూ ఉంటారు. బహుశా ఆయన కోరుకునేది కూడా ఇటువంటి శుభాకాంక్షలనే ఏమో. తెలుగుజాతి అస్తిత్వానికే చిహ్నంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగువన్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
http://www.teluguone.com/news/content/a-visionary-who-turns-the-impossible-into-reality-25-217758.html





