ఊరికే రారు మహాను భావులు.. అంబటి, ఉండవల్లి గుంటూరు ట్రిప్ మర్మమేంటో?
Publish Date:Dec 15, 2025
Advertisement
గుంటూరులో ఇటీవల ఉండవల్లి అరుణకుమార్, అంబటి రాంబాబు కలిసి, ఇద్దరు మాజీ ఎంపీలు, టీడీపీ నాయకులు యలమంచిలి శివాజీ, రాయపాటి సాంబశివరావులను కలిశారు. వారిద్దరూ ఆనారోగ్యంతో ఉన్నారని పరామర్శకు వెళ్ళామని అంబటి ఒక వీడియో చేసి యూట్యూబ్ లోని తన సొంత సైట్లో పెట్టారు. దీనిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు. తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది. అంబటి రాంబాబు అప్పుడెప్పుడో అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట, 1989లో రేపల్లెలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదైపోయాక మళ్లీ 2019లో వైసీపీ నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు మంత్రిగా కూడా పని చేశారు. అంతే మళ్లీ ఆయన్ని సత్తెనపల్లికి కూడా పనికిరాడని తేల్చేసిన జగన్ జిల్లా మార్చేసి.. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది. అయితే ఆయన ఆశలు పెట్టుకున్న గుంటూరు వెస్ట్ పార్టీ బాధ్యతలు మాత్రం అప్పగించలేదు. దాంతో అంబటి వారు నియోజకవర్గం లేని మాజీ మంత్రిగా మిగిలిపోయారు. అదలా ఉంటే రాజధాని అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న గుంటూరు జిల్లాలో వైసీపీకి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అమరావతిపై కమ్మ సామాజికవర్గం ముద్ర వేసి, ఆ ఆక్కసుతో అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిన వైసీపీకి జిల్లా వాసులు తగిన బుద్ది చెప్పారు. ఇప్పటికీ అమరావతిపై వైసీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. ఆ క్రమంలో జిల్లాలో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ఆ ఎఫెక్ట్‌తో ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులకు, పార్టీ ఇన్చార్జులకు బాధ్యతలు కట్టబెడుతోంది. అందులో భాగంగానే తమ పార్టీపై ఉన్న కమ్మ వ్యతిరేక ముద్రను తుడిచేసుకోవడానికి అంబటి రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నారు. పొలిటికల్‌గా ఎక్స్పైర్ అయిపోయి, దాదాపు అందరూ మర్చిపోతున్న టీడీపీ మాజీ ఎంపీలు, గుంటూరులో సీనియర్ కమ్మ నేతలు రాయపాటి సాంబశివరావు, యలమంచిలి శివాజీలు అందుకే అంబటికి గుర్తు కొచ్చారంటున్నారు. ఏదో ఒక వంక చెప్పి వారితో మాట్లాడివస్తే, లేనిపోని విమర్శలు వస్తాయి కాబట్టి... వారి అనారోగ్యం పేరు చెప్పి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కలిసి వారిని కలిసి వచ్చారు. ఆ సందర్భంగా 80 ఏళ్లు పైబడిన యలమంచలి శివాజీ రాజ్యసభ స్థానానికి ఇప్పటికీ అర్హులని అయన్ని అందలానికెక్కించేసేలా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉండవల్లికి సోదరుడు వరుసయ్యే రఘు అనే పెద్దాయన్ని కలిస్తే.. ఆయన అంబటి రాంబాబు ముఖ్యమంత్రి అయిపోతారని జోస్యం చెప్పేశారు. అదలా ఉంటే వైఎస్ కు అంబటి , ఉండవల్లి ఇద్దరూ ఆప్తులు.. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు కూడా. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటించేసిన ఉండవల్లి సమయం వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబును విమర్శిస్తుంటారు. జగన్ పై కూడా విమర్శలు చేసినా అవి చాలా సున్నితంగా, జనగ్ హితం కోరి ఇస్తున్న సలహాల్లా ఉంటాయి. అటువంటి ఉండవల్లి ఇప్పుడు పనిమాలా గుంటూరు రావడం, అంబటితో కలసి రాయపాటిని, శివాజీ ని కలవడం.. శివాజీ రాజ్య సభలో ఉండాల్సిన వారంటూ పొగడ్తలు కురిపించడం వెనుక ఎదో మతలబు ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి సొంత పార్టీలో నియోజకవర్గం లేక .. టీడీపీ మాజీలైన కమ్మ దిగ్గజాలతో అలా కానిచ్చేస్తున్న అంబటి లెక్కలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
http://www.teluguone.com/news/content/-what-is-the-mystery-behind-ambati-and-undavallis-guntur-trip-39-211022.html





