అంతర్రాష్ట్ర గుర్రపు పందాల రాకెట్ ను గుట్టు రట్టు చేసిన పోలీసులు
Publish Date:Aug 3, 2025
Advertisement
బాగా చదువుకున్నాడు... ఇతర రాష్ట్రానికి వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించాడు. కానీ అడ్డదారిన అడ్డగోలుగా సంపాదించి సంపన్నుడు కావాలన్న దురాశతో తప్పుదోవ పట్టాడు. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అంతర్రాష్ట్ర బెట్టింగ్ సామ్రా జ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా గత ఐదు సంవత్సరాలు గా అంతర్రాష్ట్ర బెట్టింగ్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కబడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ పాత గుంటూరుకి చెందిన తోకల నగేష్ (45) అనే వ్యక్తి మహావీర్ కళాశాల నాగార్జున విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాడు. చదువు పూర్తి అయిన తర్వాత చెన్నైలోని హ్యూ లేట్ ప్యాకర్డ్ కంపెనీలో పని చేశాడు. ఆ సమయంలో నగేష్ గుర్రపు పందాలకు బానిస అయ్యాడు. అయితే 2020 కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులతో నగేష్ చెన్నై నుండి హైదరాబాద్ కు మకాం మార్చాడు. అదే సమయంలో నగేష్ కు హైదరాబాద్ కు చెందిన రాజేష్ కుమార్, విజయవాడకు చెందిన వెంకట చౌదరి తో పరిచయం ఏర్పడింది. నగేష్ ఈ ఇద్దరితో కలిసి గుర్రపు పందాలు ప్రారంభించాడు. బాగా లాభాలు వస్తుండటంతో నగేష్ ఆ ఇద్దరి నుండి విడిపోయి హైదరాబాదు నగరంలో ఉంటూ గుర్రపు పందాలు నిర్వహించాడు. షిమ్ వెల్ ఎంటర్ ప్రైజెస్ అనే వాట్సాప్ గ్రూప్ ను సృష్టించి.. గేమింగ్ హౌస్ ఆఫ్ హార్స్ బెట్టింగ్ నిర్వహించాడు. అమాయకులను ప్రలోభ పెట్టి పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించి... వారిచేత పెట్టుబడి పెట్టించేవాడు... ఈ విధంగా నిందితుడు నగేష్ అక్రమ గుర్రపు బెట్టింగ్లో దేశవ్యాప్తంగా 105 మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. అందులో 20 మంది జంట నగరానికి చెందిన వారే ఉన్నారు. జవహర్ నగర్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే దాడులు చేసి అంతర్రాష్ట్ర గుర్రపు బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు చేసి... నగేష్, బుర్ర వెంకయ్య చౌదరి, చల్లా రమేష్ బాబు, డి సునీల్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు లక్షల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, రెండు ఖాతాల్లో ఉన్న 2,47000 సీజ్ చేశారు. వెంకట్ చౌదరి, రాజేష్ కుమార్ పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు బ్యాంక్ ఖాతాలలో 8,34,50,749 లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.
http://www.teluguone.com/news/content/-police-bust-interstate-horse-racing-racket-39-203400.html





