ఆయిల్ దేశం పని... అయిపోయిందా?
Publish Date:Oct 5, 2016
Advertisement
సౌదీ అరేబియా... ఈ పేరు భారతీయులకు బాగానే తెలుసు. దుబాయ్ తరువాత గల్ఫ్ దేశాల్లో మన వాళ్లు ఎక్కువగా వలసపోయేది ఇక్కడికే! కూలీ కోసం వెళ్లే నిరక్షరాస్యులు మొదలు ఇంజనీరింగ్ చేసిన విద్యావంతుల వరకూ చాలా మంది మనోళ్లు అక్కడ వుంటారు. వుండటమే కాదు ఒకప్పుడు ఎంతో కొంత వెనకేసుకున్నారు కూడా. కాని, ఇప్పుడు సీన్ మారిపోయింది. సౌదీకి వెళ్లి కావాల్సినంత సంపాదించుకుని తిరిగొచ్చి సౌక్యంగా వుండొచ్చనేది గతం! అయిల్ తో అలరారే దేశంలో ఆకలితో అల్లాడిపోయే వారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు!
సౌదీ అరేబియా ఆయిల్ సమృద్ధిగా దొరికే గల్ఫ్ దేశాల్లో ఒకటి. ముస్లిమ్ ల పవిత్ర స్థలమైన మక్కా వుండేది కూడా ఇక్కడే. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత వున్న సౌదీకి మరో విశేషం కూడా వుంది. అదే అక్కడి సంపద. భూమిలోంచి కావాల్సినంత చమురు తోడుకున్న అక్కడి రారాజు ఇంత కాలం కళ్లు బైర్లు కమ్మే వైభోగం అనుభవించాడు. అంతే కాదు, చాలా మంది సౌదీ శ్రీమంతులు కూడా చమురు అమ్ముకుంటూ ఇంతకాలం చెమట కార్చకుండా హాయిగా బతికేశారు. కాని, రాను రాను పరిస్థితి మారిపోతోంది...
ఇంతకీ సౌదీకి ఏమైంది? మరేం లేదు... సౌదీకి ప్రధానమైన ఆదాయమైన అయిల్ రేట్ తగ్గిపోతోంది. ఇక్కడ మనకు పెట్రోల్ ధరలు పెద్దగా తగ్గటం లేదుగాని అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్నాయి. దీని వెనుక భారీ మార్కెట్ ఒడిదుడుకులు వుంటూ వస్తున్నాయి. అవ్వన్నీ పక్కన పెడితే చమురు ధరల పతనం మాత్రం సౌదీ కొంప ముంచుతోంది. రాబడి తగ్గటంతో ఆ దేశ రాజు పన్నులు ఎడాపెడా బాదేస్తున్నాడు! ఎంతగా అంటే వాళ్ల దేశానికి వచ్చే జనానికి వీసా కోసం చెల్లించాల్సిన ఛార్జీల్ని భారీగా పెంచేశాడు. ఒకటి రెండు కాదు ఎనిమిది రెట్లు వీసా ఛార్జీలు పెంచాడు!
విదేశీయులపై భారం పడే వీసా ఛార్జీలే కాదు సౌదీ పౌరులకి కూడా చుక్కలు చూపించేలా ధరలు పెంచుతోంది అక్కడి ప్రభుత్వం! ఇంట్లో వాడుకునే ఇంధనం, విద్యుత్, అఖరుకి తాగు నీటిపై కూడా భారీగా పన్నులు పెంచేసింది. ఇది చాలదన్నట్టు సౌదీలోని శ్రీమంతులు ఇతర దేశాల నుంచి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని తెచ్చుకుంటే ... ఆ పారిన్ భార్యలకి అదనంగా పన్నులు వసూలు చేస్తోంది. కేవలం విదేశీ భార్యలే కాదు సౌదీలో వుంటోన్న ప్రతీ విదేశీయుడు గతంలో కంటే చాలా ఎక్కువగా పన్ను చెల్లించాల్సి వస్తోంది ఈ మధ్య! దీని వల్ల మన భారతీయ వలస కూలీల జీవితాలు దుర్భరంగా మారిపోతున్నాయి. వచ్చే జీతాలే తక్కువ అంటే దాంట్లోంచి ఈ కొత్త పన్నులు కట్టుకునే సరికి కడుపునిండా తిండి కూడా వుండటం లేదు. ఇక కొందరి పరిస్థితి అయితే ఆల్రెడీ రోడ్డున పడింది. మన వాళ్లు చాలా మంది దయనీయ స్థితిలో వుంటూ సౌదీలో మన ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు...
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతయని సామెత. దానికి సరైన నిదర్శనం సౌదీ అరేబియా. చమురు డబ్బులు వచ్చినవి వచ్చినట్టు విలాసాల కోసం, విందుల కోసం ఖర్చు చేశారు. అలాగే ప్రజల సంక్షేమం కోసం భారీగానే ఖర్చు చేశారు. కాని, ఇప్పటికీ రాచరికంలో వున్న ఆ దేశంలో మళ్లీ మళ్లీ ఆదాయం వచ్చేలాగా ఏ ఏర్పాటూ చేసుకోలేదు. ఉత్పత్తి రంగం, సేవల రంగం వంటి వాటి మీద దృష్టి పెట్టలేదు. అందుకే, ఇప్పుడు చమురు తగ్గుతోంది. మంట పెరుగుతోంది. ఇదే పరిస్థితి మిగతా అన్ని గల్ఫ్ దేశాల్లోనూ వుంది. మరి ముందు ముందు ఈ చమురు దేశాలు తమ దేశ ఆర్దిక వ్యవస్థని ఎలా మండించుకుంటాయో.... చూడాలి!
http://www.teluguone.com/news/content/-oil-45-67404.html





