ఎన్టీఆర్ కేవలం నాయకుడు కాదు..భారత ఫెడరలిజానికి బలమైన పునాది : జేపీ
Publish Date:Jul 13, 2026
Advertisement
భారత రాజకీయ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే.. స్వాతంత్ర్యానంతరం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పిన అరుదైన నాయకులలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అగ్రగణ్యులుగా నిలుస్తారని .ఎన్టీఆర్ సాహిత్య కమిటీ 4వ వార్షికోత్సవ వేడుకల్లో లోక్సత్తా అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఒక సదస్సులో ఎన్టీఆర్ రాజకీయ మరియు సామాజిక ప్రభావంపై చేసిన ప్రసంగం.. కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన నివాళి మాత్రమే కాదు, అది భారత సమాఖ్య (ఫెడరల్) వ్యవస్థ పరిణామ క్రమంపై జరిగిన ఒక లోతైన విశ్లేషణ. కేవలం జనాకర్షణ కలిగిన నాయకుడిగానే కాకుండా, దేశ రాజకీయాలను మలి దశకు నడిపించిన దార్శనికుడిగా ఎన్టీఆర్ పాత్రను జెపి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. నాటి రాజకీయ పరిస్థితులు ఎన్టీఆర్ వ్యూహం.. ! 1980ల నాటి కేంద్రంలో ఏకఛత్రాధిపత్యం నడుస్తున్న తరుణంలో ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రాంతీయ ఆత్మగౌరవం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయన, కేవలం ఆంధ్రప్రదేశ్ పరిధికే పరిమితం కాలేదు. అప్పటివరకు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో ఆయన వ్యూహాత్మక పాత్ర పోషించారని. డా. జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. 1983 నాటికి దేశవ్యాప్తంగా "ఆంధ్రప్రదేశ్" అనగానే ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడటానికి, కాశ్మీర్ వంటి సుదూర ప్రాంతాలలో సైతం కేంద్ర-రాష్ట్ర సంబంధాల గురించి చర్చ జరగడానికి ఎన్టీఆర్ ఆలోచనలే మూలకారణం. ఒక బలమైన జాతీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో ఆయన చూపిన చొరవ అప్పట్లో ఒక చారిత్రక అవసరంగా మారింది. జాతీయ భావం - సమతుల్యత అంతరార్థాలు..! రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణికి ఎన్టీఆర్ పూర్తిగా వ్యతిరేకం. కర్ణాటకతో తుంగభద్ర నీటి వివాదం తలెత్తినప్పుడు నాటి రాజకీయ నాయకులు ఆవేశపూరిత నిర్ణయాల కోసం ఒత్తిడి తెచ్చినా.. "దేశం ఒక్కటే, అక్కడ ఉన్నది మనవారే" అంటూ సంయమనం పాటించడమే కాక, జాతీయ సమగ్రతకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ ఘటన ఎన్టీఆర్ సంకుచిత ప్రాంతీయవాది కాదని, అపారమైన జాతీయ భావం కలిగిన సమసమాజ స్థాపకుడని నిరూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఆయన కనబరిచిన నిబద్ధత, విలాసాలకు దూరంగా ఉంటూ ప్రజాధనాన్ని కాపాడటం వంటి అంశాలు నేటి తరం రాజకీయాలకు అత్యంత ఆదర్శనీయం. అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తూనే, ఆర్థిక ప్రగతిని ఎలా సాధించవచ్చో ఆయన తన ఇంగిత జ్ఞానంతో చేసి చూపించారు. భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం.. భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ బతికి బట్టకట్టింది అంటే దానికి ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదులే కారణం. 1980ల నాటి బలహీన సమాఖ్య వ్యవస్థ నేడు రాష్ట్రాలకు ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛను ఇచ్చే స్థాయికి చేరిందంటే, నాటి ఎన్టీఆర్ పోరాటమే స్ఫూర్తి. కాంగ్రెస్ ఏకపక్ష ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ దేశంలో ద్వితీయ దశ రాజకీయాలకు ఆయన నాంది పలికారు. ప్రస్తుత తరుణంలో దేశం మూడో దశ రాజకీయ పరిణామాల వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఆశయాలు, ఆయన చూపిన సమాఖ్య స్ఫూర్తి మరింత ప్రశంసనీయంగా మారాయి. ప్రజాకర్షక పథకాలతో పాటు దేశ సమగ్రతను, ఆర్థిక క్రమశిక్షణను సమతుల్యం చేసే ఎన్టీఆర్ రాజకీయ నమూనా రాబోయే కాలంలో ప్రాంతీయ జాతీయ పార్టీలకు ఒక దిక్సూచిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని జేపీ తెలిపారు.
http://www.teluguone.com/news/content/-ntr-political-history-36-225868.html





