ఇక రె "ఢీ"
Publish Date:Aug 1, 2016
Advertisement
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చిన వివరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన మాటల్లో తేటతెల్లం అయ్యింది. ఎన్ని సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా..ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని మరోసారి రుజువైంది. జైట్లీ ప్రకటన నేపథ్యంలో చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రులు, ఎంపీలు, సీనియర్ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం వేళ చంద్రబాబు ఒక రాష్ట్రధినేతగా..ఒక నిఖార్సైన రాజకీయవేత్తగా వ్యవహరించారు తప్ప ఎక్కడా పట్టుకోల్పోలేదు. గొంతులో తొణకని ఆత్మవిశ్వాసం..మితిమీరిన భావోద్వేగాలు, తీవ్ర హావభావాలు, పరుష పదజాలం ఏవి లేవు..దగా పడి, గాయపడిన మనసు తాలూకూ ఉక్రోశం, బేలతనం జాడ మచ్చుకు కూడా కనిపించలేదే. ప్రభుత్వంలో ఉండి ఏం సాధించారని ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు..బయటకు రమ్మంటూ విసుర్లు. కానీ ఎప్పుడు ఏం చేయాలో తెలిసినవాడే అసలైన నాయకుడు. అందుకే ఎవరెన్ని మాటలన్నా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజనీతితో వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పెదవి విరుస్తూనే..ఇచ్చిన హామీలను గుర్చు చేస్తూ సాగింది ఆ ప్రసంగం. ఒకప్పుడు చెన్నై నుంచి కర్నూలుకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరాం. అరవై ఏళ్లు ఉన్న తర్వాత నెత్తిన అప్పు పెట్టుకుని అమరావతికి వచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి, ప్రధానమంత్రికి లేదా..? ఆ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు.. ఏపీ కూడా ఈ దేశంలో అంతర్భాగం, మనమూ పన్నులు కడుతున్నాం. అలాంటప్పుడు మనకు మాత్రమే ఎందుకు అన్యాయం జరగాలంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు విభజించారు: కాంగ్రెస్‌కు పట్టిన గతి గుర్తులేదా..? ప్రధానిదే బాధ్యత బంద్‌ల వల్ల ఒరిగేదేమి లేదు బాధ్యత లేని ప్రతిపక్షం
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు...ఏపీ ప్రజలు కోరుకున్న విభజన కాదిది. రాష్ట్రంలో వనరులు లేవని అనుకున్నపుడు విభజనకు ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబు బీజేపీని ప్రశ్నించారు. నాడు విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాయని, మెజారిటీ పార్టీలన్నీ, హోదా, విభజన చట్టానికి అనుకూలమేనన్న సంకేతాలను పార్లమెంట్ సాక్షిగా ఇచ్చాయని తెలిపారు. అప్పుడు పట్టుబట్టి ప్రత్యేకహోదా బిల్లులో పెట్టించిన బీజేపీ, ఇప్పుడేమో నిబంధనల పేర్లు చెప్పి తప్పించుకోవాలనుకుంటోందని అభిప్రాయపడ్డారు. ఏం చేయలేనపుడు ఎందుకు విభజించారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసికట్టుగా రాష్ట్రాన్ని విభజించాయని..ఆ అన్యాయాన్ని ప్రజలు మరచిపోయేలా చేయాల్సి ఉందని, నాడు అంగీకరించి, ప్రజలకు హామీలిచ్చి, నేడు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని ఎలా చెబుతారని ప్రశ్నించారు.
ఎవరెన్ని చెప్పినా వినకుండా..హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పన్నిన కుట్రలు అందరికి తెలుసునన్నారు. బిల్లు నెగ్గించుకోవడం కోసం పార్లమెంట్ తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలు సైతం నిలిపివేసి దుర్మార్గంగా వ్యవహరించారని చంద్రబాబు అన్నారు. అలాంటి కాంగ్రెస్‌కు ప్రజలు ఏ గతి పట్టించారో గుర్తులేదా..ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమతీర్పుని..హామీలు నెరవేర్చని రాజకీయ పార్టీలను వారే ఇంటికి పంపుతారని గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడచినా ఇప్పటికీ అనేక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. కేంద్రం చేయ్యాల్సిన పనులు ఇప్పటికీ చేయలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు ఖర్చు చేశాం. రెవెన్యూ లోటు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అది నెరవేర్చలేదు, ఆర్ధిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. మిగతా రాష్ట్రాలతో పాటే ఏపీని చూశారు. నేనేం ప్రత్యేకంగా ఏమి అడగటం లేదు..విభజన బిల్లులో ఉన్నవి..ప్రధాని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.
ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా బంద్‌లకు పిలుపునిచ్చారని, కాని ఇది సరైన ఆలోచన కాదు..అన్యాయానికి వ్యతిరేకంగా కేంద్రంతో పోరాడాల్సిందే తప్ప రాష్ట్రంలో కాదు. బంద్‌లకు పిలుపునిచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వల్ల మనకే నష్టం. జపాన్‌లో తరహా నిరసన తెలిపి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. నల్లబ్యాడ్జీ ధరించి ఒక మొక్క నాటినా అదే నిరసన, బస్సు ధ్వంసం చేసినా అదే నిరసన.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనా చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతిపక్షం ఉంది. నేనేదో కేసులకు భయపడుతున్నాననడం విడ్డూరంగా ఉంది. అసలు ఈడీ కేసులు, సీబీఐ కేసులున్న వ్యక్తి భయపడాలి కానీ నాకేందుకు భయం. ఇలాంటి రాజకీయ పార్టీల అవసరం రాష్ట్రానికి ఉందా అని ప్రజలు ఆలోచించుకోవాలి. రాజకీయాలంటే తెలియకుండా సమయం, సందర్భం లేకుండా ప్రతిపక్షనాయకుడు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నాడని చంద్రబాబు అన్నారు.
http://www.teluguone.com/news/content/-andhra-special-status-37-64533.html





