అమ్మకానికి తెలుగు టీవీఛానెళ్ళు

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలుగులో 13 టీవీ న్యూస్‌ ఛానెళ్ళు నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయి...! రేటింగుల కోసం పడరాని పాట్లు పడుతూ.. యాడ్‌రెవిన్యూ తెచ్చుకోవడం కోసం అన్ని రకాల మార్గాలనూ అన్వేషిస్తూ...ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తగినంత రాబడి లేక, జీతాలు చెల్లించలేక, నిర్వహణ సామర్థ్యం కొరవడి కుదేలవుతున్నాయి...! అయినకాటికి అమ్మేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి!

 

అవసరాన్ని మించి...

ఒకటి కొత్త...రెండోది పోటీ...మూడోది అవసరం...నాలుగోది పర్లేదు...ఉండొచ్చు...!  అంతేగానీ... ఏకంగా 13 టీవీన్యూస్‌  ఛానెళ్ళు అవసరమా? ఇదే ప్రస్తుతం తెలుగునాట వినిపిస్తున్న ప్రశ్న...! ఇదిలా ఉంటే మరో అయిదారు న్యూస్‌ ఛానెళ్ళు ఊపిరిపోసుకో బోతున్నాయి కూడా! ఇన్ని టీవీలు చెప్పేందుకు తెలుగునాట కొత్తవార్త లేముంటాయి? కొత్తగా వీరు చెప్పేందుకు కొత్తసంగతులు ఎప్పటికప్పుడు ఎక్కడినుంచి పుట్టుకొస్తాయి.

 

మీడియా అంటే అంత ఆకర్షణ ఎందుకు?

మీడియాలో ఏముందని ఇంత మంది పెద్దలు పోటీపడుతున్నారో అర్థంకాని పరిస్థితి తెలుగు జనాలది! పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొత్తటీవీల్లో నిలబడేవి ఎన్ని? ప్రజాదరణ పొందేవిఎన్ని? పుబ్బలో పుట్టి మఖలో మూతబడేవి ఎన్ని! రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు టీవీఛానెళ్ళు స్వంతంగా ప్రారంభించేందుకు ఎందుకింత ఉత్సాహపడుతున్నారు? టీవీల ద్వారా వీళ్ళు సాధించాలనుకునేది ఏమిటి? ఏ ప్రయోజనం కోసం కోట్లాది రూపాయల పెట్టుబడుల ప్రవాహం టీవీఛానెళ్ళు కోసం, తరలిస్తున్నారు! అసలు వీళ్ళ టార్గెట్‌ ఏమిటి? అన్నీ ప్రశ్నలే! అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే!

 

ఇన్ని ఛానెళ్ళు అవసరమా ?

ఇన్ని ఛానెళ్ళకు మన తెలుగుగడ్డపై స్పేస్‌ ఉందా? అని ఆలోచిస్తే..జనం నుంచి సమాధానం వచ్చేలోగానే ‘ఇంకా చాలా స్పేస్‌ ఉంది..’ అంటూ మీడియా పీపుల్‌ ఠక్కుమంటూ చెప్పేస్తుంటారు. వాస్తవం ఆలోచిస్తే ఇన్ని టీవీన్యూస్‌ ఛానెళ్ళు అవసరం లేదనే అనిపిస్తుంది. జనం ఎప్పుడూ గుంభనంగానే ఉంటారు. వాళ్ళ వెర్షన్‌ స్పష్టంగా ఎప్పుడూ చెప్పట్లేదు. అందుకే మౌనం అర్ధాంగీకారమంటూ టీవీన్యూస్‌ ఛానెళ్ళ ఏర్పాట్లలో పారిశ్రామికవేత్తలు, పొలిటికల్‌ లీడర్లూ బిజీబిజీగా ఉంటున్నారు మరి!

 

వార్తను వార్తగా చెబ్తున్నారా ?

వార్తను వార్తగా చెప్పే న్యూస్‌ ఛానెల్‌ ఒక్కటీ లేదంటే అతిశయోక్తి కాదు...! చిన్నపాటి సమాచారం లభిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేసి, సొంతభాష్యం జోడిరచి న్యూస్‌గా ప్రెజెంట్‌ చేస్తున్నారు. చాలాసార్లు ఆ వార్తను వార్తగా చెప్పకుండా కంక్లూజన్‌ కూడా వీళ్ళే చెప్పేయడం చాలాసార్లు ఎబ్బెట్టుగానే ఉంటోంది!

 

వార్త నిజమా? కాదా?

టీవీలో వార్త వస్తే అది నిజమో కాదో మనకస్సలు అర్థం కాదు. ఆ వార్త నిజమోకాదో తెలుసుకోవాలంటే మరో రెండు మూడు ఛానెళ్ళు చూడాల్సిందే! వార్తకు స్వంత భాష్యం జోడిరచి, స్వప్రయోజనాల ప్రాతిపదికగా న్యూస్‌ ప్రసారం అవుతుంటే ‘అసలు విషయం’ అర్థమయ్యేదెలా? కొత్తగా వచ్చే ప్రతీ ఛానెల్‌ ‘తాజా వార్తల సమాహారం’గానే చెప్పుకుంటుంది’ తీరా చూస్తే అంతా ఒకటే మూసపోసిన విధానమే!

 

పెరగని వ్యూయర్స్‌

ఇన్ని ఛానెళ్ళు వచ్చినా టీవీ న్యూస్‌ వ్యూయర్స్‌ సంఖ్య అస్సలు పెరగలేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది! కేవలం 15 శాతం మందే న్యూస్‌ ఛానెల్స్‌ చూస్తుండగా మిగిలిన 85శాతం మంది ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారంటే న్యూస్‌ ఛానెల్స్‌ కొత్తగా సాధించినది ఏమీ లేదని స్పష్టమౌతోంది మరి! అయినా ఇన్ని ఛానెళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే`రాజకీయ ప్రచారం కోసం స్వంత వాణిని స్వంత బాణీలో వినిపించడం కోసమేనని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల ప్రచారం కోసం, తద్వారా స్వప్రయోజనాల సిద్ధికోసం పారిశ్రామిక వేత్తలు టీవీ న్యూస్‌ ఛానెళ్ళు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు! ఇదీ ఓ రకమైన వ్యాపారమే! టీవీ ఛానెల్‌ ఏర్పాటు చేసి, జనంలోకి తీసుకు వెళ్ళి, కొద్దిరోజుల పాటు నిర్వహించి అధిక లాభం కోసం ఇంచక్కా అమ్మేసుకోవచ్చన్న మాట! అదే ఇప్పుడు తెలుగు టీవీ న్యూస్‌ ఛానెళ్ళ పరిస్థితి!

 

న్యూస్‌ ఛానెళ్ళ జాతర!

 తెలుగునాట వార్తలకు కొదవలేదు. పిల్లినాలుగు  పిల్లల్ని కంటే వార్త...! కుక్క తోక ఊపకపోతే వార్త...!బ్రేకింగ్‌ న్యూస్‌... అతిసాధారణ అంశాన్ని సెన్సేషనల్‌ వార్తగా టీవీలో ప్రసారం చేసేస్తుంటే` చూడటం ఎంత ఇబ్బందిగా ఉంటుందో` ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది! ప్రతినిమిషం కొత్తగా చూపించ డానికి ఏమీ ఉండదు కాబట్టి` చెప్పిన విషయాన్నే మళ్ళీ చెబ్తూ... మళ్ళీ మళ్ళీ చెబ్తూ న్యూసెన్స్‌ సృష్టిస్తున్న న్యూస్‌ ఛానెళ్ళు ప్రజాప్రయోజనాలకు ఏం ఉపయోగపడక పోయినా, అధికార, రాజకీయ నాయకుల్ని అడ్డంపెట్టుకుని స్వంత ప్రయోజనాలు సాధించుకోడానికి మాత్రం చక్కగా ఉపయోగపడుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. 

 

ఛానెల్‌ చేతిలో ఉంటే పవర్‌ ఉన్నట్లే...!

న్యూస్‌ ఛానెల్‌ చేతిలో ఉంటే పవర్‌ ఉన్నట్లే...! కావల్సిన పనులు చకచక జరిగిపోతాయి...! ఛానెల్‌ వాళ్ళంటే అందరూ అంతో ఇంతో భయపడతారు...! మనజోలికి ఎవరూరారు...! మనకు కావల్సిన వాళ్ళ గురించి ఇంద్రుడూ చంద్రుడూ అంటూ పొగడ్తలవర్షం కురిపిస్తూ, వాళ్ళ వ్యతిరేకుల్ని దుర్మార్గులుగానో, అవినీతిపరులుగానో, ప్రజాప్రయోజనాలకు విఘాతం  కలిగించే వారిగానో చిత్రీకరిస్తే స్వంత ప్రయోజనాలు  నెరవేరుతాయి...! ఇదే ఆలోచన ఛానెళ్ళ ప్రారంభానికి కారణమౌతోంది.! మీడియా అంటే తెలియనివాళ్ళు కూడా డబ్బు ఉందికదా అని ఈ రంగం లోకి అడుగుపెడుతున్నారు. ఒకళ్ళను చూసి మరొకళ్ళు... వీళ్ళను చూసి వాళ్ళు... వాళ్ళను చూసి వీళ్ళు...ప్రత్యర్థులు పెట్టారని ఇంకొకళ్ళు... ఇలా...ఒకళ్ళ తర్వాత మరొకళ్ళుగా టీవీ న్యూస్‌ ఛానెళ్ళు ప్రారంభించేస్తున్నారు.

 

టీవీ ఛానెల్‌ ప్రారంభించడం చాలా ఈజీ...!

ఈ రోజుల్లో టీవీ ఛానెల్‌ ప్రారంభించడమంటే చాలా ఈజీనే! కేవలం ఓ రూ.30 కోట్లు ఉంటే చాలు... టీవీ న్యూస్‌ ఛానెల్‌  ప్రారంభించేయవచ్చు...! లైసెన్సులు వగైరాలన్నీ మిగతా వ్యాపారాలతో పోలిస్తే చాలా సులభమే! ఎలాగూ రాజకీయ నాయకుల వత్తాసు ఉండనే ఉంటుంది...! వారి వారి ప్రయో జనాల కోసమైనా లైసెన్సులు త్వరగా వచ్చేటట్లు రికమెండ్‌ చేసేస్తారు...! ఆఘమేఘాలమీద ఛానెల్‌ ఎయిర్‌లోకి వెళ్ళి పోతుంది..! స్వంత వ్యాఖ్యానాల ఊకదంపుడు కార్యక్రమాలతో తెలుగు వాకిళ్ళు దద్దరిల్లిపోతాయి...!


ఉపాధి అవకాశాలు పెరిగాయి....!

ఇబ్బడిమబ్బడిగా తెలుగులో టీవీ న్యూస్‌ ఛానెల్స్‌ ప్రారంభం కావడంతో ఉపాధి అవకాశాలు పెరిగిన మాట వాస్తవం! అయితే దీనివల్ల కొత్త ఎంప్లాయీస్‌ పుట్టారేగానీ...జర్నలిస్టులు మాత్రం తయారు కాలేదు....! న్యూస్‌ ప్రెజెంటేషన్‌ అంటే అస్సలు తెలియని వాళ్ళు ఈ రంగంలోకి వచ్చి జర్నలిస్టులుగా చలామణీ అయిపోతూండటంతో వార్తల ప్రెజెంటేషన్‌లో నాణ్యత కొరవడిరదనే చెప్పాలి. ప్రస్తుతం మార్కెట్లో చెలామణీ అవుతున్న కొత్త జర్నలిస్టుల్లో చాలా మంది యజామాన్యం చెప్పినట్లు చేసే సాధారణ ఎంప్లాయీస్‌గానే భావించబడుతున్నారు. జర్నలిస్టుల విలువ నానాటికీ దిగజారిపోతోందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

న్యూస్‌ ఛానెల్స్‌తో బాటే...

 న్యూస్‌ ఛానెల్స్‌తో బాటే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ కూడా ఇటీవలికాలంలో ఎక్కువగానే పెరిగాయి. నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువభాగం సినిమా బేస్డ్‌ కార్యక్రమాలతో ఊదరగొట్టేస్తున్నాయి! అలాగే మెడికల్‌ ఛానెళ్ళూ, ఎడ్యుకేషన్‌ ఛానెళ్ళు అంటూ కూడా కొత్తగా తెరపైకి రాబోతున్నాయి. వీటికిమార్కెట్‌పరంగా అంత లాభసాటి ఉండదని తెలిసినప్పటికీ ఛానెల్స్‌ ప్రారంభానికి ముందుకు వస్తున్నరంటే` కేవలం స్వప్రయోజనాల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారన్న విమర్శలూ ప్రజల్లో ఉన్నాయి!

 

తగ్గిపోయిన యాడ్‌ రెవెన్యూ

ఒకటి తర్వాత మరొకటిగా 13 న్యూస్‌ ఛానెల్స్‌...! అలాగే రెండు పదులకు చేరిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌.. మరో మెడికల్‌ ఛానెల్‌...! సుమారు 30 కోట్లతో ఛానెల్‌ ప్రారంభించినా ఆ తర్వాత సీన్‌ రివర్సయ్యింది! నిర్వహణ వ్యయం భరించలేనంతగా మారిపోయింది! యాడ్‌రెవెన్యూ పూర్తిగా తగ్గిపోయింది! అడ్వర్టయిజ్‌మెట్ల వల్ల వచ్చే రూపాయిని ఇంతమందీ పంచుకోవాల్సి వస్తోంది! రేటింగ్స్‌ పూర్తిగా పడిపోయాయి! ప్రకటన కర్తల్ని ఆకర్షించేందుకు నాలుగు యాడ్స్‌ ఇస్తే రెండు ఫ్రీ అనే స్థాయికి పరిస్థితి దిగజారిపోయింది! కొన్ని ఛానెళ్ళయితే ఒకటిస్తే ఒకటి ఫ్రీగా ముందుకెళ్తున్నాయి! ఈ నేపథ్యంలోనే` తగినంత ఆదాయం లేకపోవడంతో ఉద్యోగులకు నెలనెలా జీతాల చెల్లింపులు జరగటం లేదనే విమర్శలూ ఉన్నాయి. సంక్షోభంలో పడిన ఎలక్ట్రానిక్‌ మీడియా తీరుతెన్నుల్ని  సరిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది!


 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu