రాజకీయాల్లో శ్రీహరి రియల్‌స్టార్‌గా మిగులుతారా?
posted on Aug 17, 2012 4:40PM
నిన్నటి తారలు నేటి నేతలు అన్న మాట నిజం చేసేందుకు మరో నటుడు నాయకునిగా అవతారం ఎత్తేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. వెండితెరపై రియల్‌స్టార్‌గా వెలిగిన శ్రీహరి తాను ప్రజలకు ప్రత్యక్షంగా ప్రజాసేవ చేసుకోవాలనుకుంటున్నానని ప్రకటించారు. ఈయన ప్రకటన అయితే చేశారు కానీ, ఇంకా ఏ రాజకీయపార్టీలో చేరాలనుకుంటున్నారో తెలియలేదు.
ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయానికి శ్రీహరి రాలేకపోయారట. ఆయన తన సందిగ్థం వీడిన తరువాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకుని ఆ తరువాత ప్రకటిస్తామన్నారు. అయితే 2009లో వచ్చినట్లే ఇది కూడా పుకారేనా? అని అనుకోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే శ్రీహరి మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని తెలిపారు. వెండితెరపై ఫైట్లు ద్వారా ఆగ్రనటుల్లో ఉత్తమగుర్తింపు సాథించుకున్న శ్రీహరి తాను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీ ఎక్కడ నుంచి చేయమంటే అక్కడి నుంచే పోటీ ఉంటుందన్నారు.
శ్రీహరి తన కుమార్తె పేరిట ఇప్పటికే ఓ ట్రస్టు నడుపుతున్నారు. ఈ ట్రస్టుద్వారా సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మమేకమయ్యేందుకు కృషి చేస్తున్నారు. రాజకీయంలో చేరినా సేవాకార్యక్రమాలను వదలనని శ్రీహరి స్పష్టం చేశారు. రాజకీయతెరపై కూడా శ్రీహరి రియల్‌స్టార్‌గా వెలుగొందాలని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆశిస్తున్నారు.