దీనిభావమేమి ఓ ప్రజాస్వామ్యమా?

జాతిపిత మహాత్మాగాంధీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఫోటోలను ఒకే ఫ్లెక్సీలో పెట్టి గుంటూరులో ప్రదర్శించినందుకుగాను కాంగ్రెస్‌ ఎం.పి. వి. హనుమంతరావు సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి తన నిరసన వ్యక్తం చేశారు. బిందెలతో పాలను తెప్పించి పైరింజన్‌ ద్వారా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇందుకుగాను ఫైరింజన్‌కు అడ్డొచ్చిందని ఫుట్‌పాత్‌ను సైతం పగులగొట్టించగా, దానికి నిరసనలు తెలపడంతో తన స్వంత ఖర్చుతో ఫుట్‌పాత్‌ను కట్టిస్తానని హామిఇచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ ఫోటోపక్కన జగన్‌ ఫోటో పెట్టడం బాధించిందని, అందుకు తాను పాలాభిషేకం ద్వారా మనశ్శాంతి పొందానని చెప్పారు.

 

సాధారణంగా మన ప్రజాస్వామ్య దేశంలో అధికారంలో ఉన్నవారు అధికారాన్ని నిలుపుకోవడానికి, అధికారంలో లేనివారు అధికారంలోకి రావడానికి ఎన్నికలు వచ్చి అవి జరిగేవరకు కూడా ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరెవరు ఏ ప్రయత్నం చేసినా దాని అంతిమ లక్ష్యం గుర్తింపుకోసమో, అధికారంకోసమో. ప్రజల్లో సానుభూతి కోసమో, లేదా వారిలో మంచిపేరును సంపాదించేందుకో.. అయ్యుంటుందన్నది జగమెరిగిన వాస్తవం...! ‘ఉప్పు కర్పూరంబు నొక్కపోలికనుండు, చూడచూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అని వేమన సెలవిచ్చాడు. నేటి ఈ రాజకీయాల్లో ‘నేతలందు అసాధారణ నేతలు వేరయా’ అని అనాల్సి వస్తోంది ఈ సంఘటన చూస్తే. మన ప్రజాస్వామ్యదేశంలో ఏ నాయకుడు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందనే దానికి ఇవే ఉదాహరణలేమో!ఏదేమైనా మహాత్ముల విగ్రహాలు సైతం అధికారకాంక్షకు పావులుగా ఉపయోగపడుతున్నాయా అనిపిస్తోంది!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu