ముస్లిం మహిళాగా ఎమ్మెల్యే రజనీ! రంజాన్ సందేశం కోసం కొత్త గెటప్!
posted on Apr 24, 2020 2:24PM
చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే రజనీ ప్రచారం విషయంలో ఏ మాత్రం తగ్గరట! సోషల్ మీడియాలో లక్షల రూపాయలు ఇట్టే ఖర్చు పెట్టేస్తున్నారు మేడం. వీడియో సందేశాలు ఇవ్వడం, ఫొటో స్టిల్స్ విషయంలో సినిమా వారికి ఏమాత్రం తగ్గకుండా యాక్టర్‌లతో పోటీ పడుతూ ఎమ్మెల్యే రజనీ షూటింగ్‌లలో బిజీగా వుంటున్నారట.
చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే రజనీ నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉంటారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అప్రమత్త పెంచడానికి తన దైన స్టైల్‌లో ఆమె వీడియో తీసి ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు.
శనివారం నుండి రంజాన్ నెల ప్రారంభం అవుతుంది. రంజాన్‌ను దృష్టిలో పెట్టుకొని ముస్లింలను ఉద్దేశించి ఆమె ప్రత్యేక సందేశం ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అంతే కాదు మసీదులకు వెళ్ళవద్దని, ఇఫ్తార్ సమయంలో గుంపులుగా కూర్చొని తినవద్దంటూ ముస్లింలను ఎమ్మెల్యే రజనీ కోరారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కరోనా నియంత్రణకు విశేషకృషి చేస్తున్నారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియోజకవర్గ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే రంజాన్ శుభాకాంక్షలు తెలపడానికి ఆమె ప్రత్యేక వీడియో, ఫొటో షూట్ చేశారు. సినిమా నటుల్ని తలపించేలా షూటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి వీడియోలో కనిపించారు. సందేశం ఇచ్చేటప్పుడు టీవీ యాంకర్‌లా నటించారు. టీవీలో వార్తలు చదివినట్లు కరోనా సందేశం, రంజాన్ సందేశాన్ని నియోజకవర్గ ప్రజలకు వినిపించారు.

ఆ తరువాత ఫొటో షూట్‌లో ముస్లిం మహిళలా గెటప్‌లో కనిపించారు. చేతిలో ఓ పుస్తకం పట్టుకొని ఫొటో స్టిల్ ఇచ్చారు. ఈ వీడియో, ఫొటోలను తన అనుచరులతో సోషల్ మీడియాలో విసృత ప్రచారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే మేడం ప్రచారం విషయంలో ఎక్కడా తగ్గరని స్థానికంగా జనం అనుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పట్టి వరకు సోషల్ మీడియాలో ప్రచారం కోసం 10 లక్షల రూపాయల కంటే ఎక్కువే ఖర్చు పెట్టారు రజనీ మేడం.