సమైక్య తీర్మానానికి వైకాపా మద్దతు ఇస్తుందా?

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నుండి శాసనసభ వ్యవహారాల శాఖను వెనక్కి తీసుకొని దానిని తన సమైక్య అనుచరుడు శైలజానాథ్ కు కట్టబెట్టారు. దానిపై ప్రస్తుతం జరుగుతున్నయుద్ధం గురించి అందరూ చూస్తూనే ఉన్నాము. శైలజానాథ్ చేత రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ శాసనసభలోఒక తీర్మానం ప్రవేశపెట్టించాలనేది ముఖ్యమంత్రి వ్యూహంగా కనబడుతోంది.

 

వైకాపా మొదటి నుండి సమైక్య తీర్మానం కోసం పట్టుబడుతూ, అదిచేసే వరకు సభను నడవనీయమని చెపుతున్నందున, ఇప్పుడు తీర్మానం ప్రవేశపెడితే దానికి మద్దతు ఈయవలసి ఉంటుంది. ఇక ఇటీవల ఏపీఎన్జీవోలు సమైక్యాంద్ర కోసం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్, తెదేపాలు రాష్ట్రాన్ని విడిపోకుండా ఉంచేందుకు కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా అంగీకరించాయి గనుక సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దానికి బేషరతు మద్దతు ఈయవలసి ఉంటుంది. కానీ వారితో కలిసి పనిచేయడానికి ఇష్టంలేదని కుంటిసాకుతో ఆ వైకాపా సమావేశానికి హాజరవలేదు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ పార్టీ అదే వైఖరి అవలంబించవచ్చును.

 

వైకాపా మొదటి నుండి ఈ తీర్మానం కోసమే పట్టుబడుతునందున, ఇప్పడు అది సభలో ప్రవేశపెట్టబడినట్లయితే దానికి మద్దతు ఈయకుండా తప్పించుకోవడం కూడా కష్టమే. అలాగని మద్దతు ఇస్తే దానివలన ముఖ్యమంత్రికే మరింత పేరు వస్తుంది తప్ప వైకాపాకు రాదు. సీమాంధ్రలో ఏకైక సమైక్యచాంపియన్ గా నిలబడాలనుకొంటున్న జగన్మోహన్ రెడ్డి, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తనకు పోటీగా తయారవ్వాలని కోరుకోరు. అదీగాక, రాష్ట్ర విభజన జరిగితే తప్ప వైకాపాకు రాజకీయ లబ్ది కలుగదు. ఈ తెర్మానానికి మద్దతు ఇస్తే అది విభజనకు అడ్డంకులు సృష్టిస్తే, ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరుగకపోతే వైకాపా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గనుక ఒకవేళ సభలో మంత్రి శైలజానాథ్ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ తీర్మానం ప్రవేశపెట్టినా దానికి వైకాపా ఏవో కుంటి సాకులు చెప్పి మద్దతు ఈయకుండా తప్పుకోవచ్చును.

 

ఇది వైకాపాకు చాలా ఇబ్బంది కలిగించే విషయమే. కానీ, టీ-కాంగ్రెస్, తెరాస శాసనసభ్యులు ఆ తీర్మానం సభలో ప్రవేశపెట్టకుండా సభను ఎలాగూ స్తంభింపజేస్తారు గనుక, వైకాపాకు ఇక దాని గురించి ఎటువంటి దిగులు ఉండదు. కావాలంటే తను కూడా వాళ్ళతో చేరి సమైక్యతీర్మానం ప్రవేశపెట్టమని గొడవ చేస్తూ సభను స్తంభింపజేసి వాయిదాపడేలాచేయవచ్చు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu