ఉప ఎన్నికలలో వైకాపా పోటీ పరమార్ధం అది కూడా?

 

తెలంగాణా రాష్ట్రంలో కూడా వైకాపా ఉన్నప్పటికీ అది ఏనాడూ ప్రజా సమస్యలపై తెరాస ప్రభుత్వానికి వాటిరేకంగా పోరాడలేదు. ఆ రెండు పార్టీలకు మధ్య ఉన్న రహస్య అనుబంధమే దానిని నోరు విప్పనీయలేదని చెప్పవచ్చును. ఆ రెండు పార్టీల మధ్య చక్కటి, చిక్కటి అనుబంధానికి చిహ్నంగా శాసనమండలి ఎన్నికలలో తెరాసకు వైకాపా మద్దతు ఈయడం కనిపిస్తోంది. కానీ దాని వలన ఆంధ్రాలో పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్రానికి, ప్రజల ప్రయోజనాలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తెరాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రాలో వైకాపా పట్ల కొంత వ్యతిరేకత ఏర్పడిందని జగన్మోహన్ రెడ్డి సరిగ్గా గుర్తించినట్లే ఉన్నారు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనుగడ సాగిస్తూ అక్కడే ఏదో ఒకనాడు అధికారంలోకి రావాలని ఆశపడుతున్న వైకాపాకు అక్కడ ప్రజలలో పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడితే చాలా ప్రమాదం. కనుక వైకాపా కూడా తెరాసను తన శత్రువుగానే భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసేందుకు లేదా మభ్యపెట్టేందుకే వైకాపా ఈ ఎన్నికలలో తెరాసకు వ్యతిరేకంగా పోటీ చేస్తోంది తప్ప ఈ ఎన్నికలో గెలుస్తామనో లేక గెలవగలమనో ఉద్దేశ్యంతో మాత్రం కాదని చెప్పవచ్చును. ఈ ఎన్నికలో పోటీ చేయడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలలో వైకాపా పట్ల ఏర్పడిన వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తూనే మళ్ళీ ఓట్లు చీల్చి తెరాసకు పరోక్షంగా సహాయపడటం వైకాపాకి మాత్రమే సాధ్యం.