ఏపీలో కేసీఆర్ ప్రతినిధి ఎవరు?

 

రాయలసీమకు నీళ్ళందించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుపై వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అభ్యంతరాలు లేవనెత్తడం, అంతకు ముందు ఆయన స్వంత పత్రిక సాక్షిలో పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబును విమర్శిస్తూ ఒక కధనం ప్రచిరించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో చేతులు కలిపి జగన్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నాడని విమర్శించారు.

 

కొద్ది సేపటి క్రితం తన లోటస్ పాండ్ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, “నేను కేసీఆర్ తో చేతులు కలిపేనని, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నానని ముఖ్యమంత్రి నామీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. పోలవరం కట్టవద్దని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా చాలా మంది చెపుతున్నారు. అవసరమనుకొంటే నదిమీద చిన్న చిన్న లిఫ్టులు కట్టుకొని అవసరమయిన చోటికి నీళ్ళు మళ్ళించుకోమని చెపుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్టిసీమను నిర్మిస్తూ సరిగ్గా అదేపని చేస్తున్నారు. అటువంటప్పుడు కేసీఆర్ ఇచ్చిన సూచనను పాటిస్తున్న చంద్రబాబు నాయుడు ఆయనతో చేతులు కలిపినట్లా లేక దానిని వ్యతిరేకిస్తున్న నేను కేసీఆర్ తో చేతులు కలిపినట్లా?” అని ప్రశ్నించారు.

 

“ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేసే పోలవరం ప్రాజెక్టు ఈ పట్టిసీమ ప్రాజెక్టువల్ల ఆగిపోతుందనే భయంతోనే నేను దానికి అడ్డుపడుతున్నాను. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్ళు అందిస్తామని జి.ఓ.లో ఎక్కడా వ్రాసిలేదు. అంటే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం నిర్మిస్తున్నట్లు? రాయలసీమ ప్రజల కోసమా లేక అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ల కోసమా? అని ప్రశ్నించారు.

 

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపబడిన పోలవరం ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రప్రభుత్వం పదేపదే చెపుతోంది. దానికోసం ఇప్పటికే కొంత నిధులు కేటాయించి, అవసరమయిన ప్రక్రియ కూడా ప్రారంభించింది. అటువంటప్పుడు పట్టిసీమ వలన పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని ఎందుకు అపోహలు సృష్టిస్తున్నారు? తెదేపాతో చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ కున్న రాజకీయ వైరం, విద్వేషం గురించి అందరికీ తెలుసు. కనుక ఆయన పట్టిసీమ గురించి అభ్యంతరాలు లేవనెత్తితే ఆశ్చర్యం లేదు. కానీ ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు సముద్రంలో వృధాగా కలిసిపోతున్న మిగులు జలాలను రాయలసీమకు తరలించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు మొదలుపెడితే, బోడిగుండుకి మోకాలుకీ ముడేసినట్లు, ఆ ప్రాజెక్టు చేస్తే కేసీఆర్ తో చేతులు కలిపినట్లే అనే వితండవాడం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

పైగా ఆ నీళ్ళు రాయలసీమకే తరలిస్తామని జి.ఓ.లో ఎక్కడా పేర్కొలేదని ఒక లా పాయింటు కూడా తీసారు. జి.ఓ.లో రాయలసీమ కోసం అనే పదం వ్రాయనంత మాత్రాన్న ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ల కోసమే నిర్మిస్తున్నట్లా? రాయలసీమకి ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ప్రభుత్వం అందరూ శాసనసభ, మీడియా సాక్షిగా ఇంత గట్టిగా చెపుతున్నపుడు, జి.ఓ.లో రాయలసీమ కోసం అని వ్రాయలేదు కనుక ఆ నీళ్ళన్నిటినీ అక్కడికి కాక మళ్ళీ సముద్రంలోకే వదిలిపెడతారా? అని ప్రశ్నించుకొంటే జగన్ వాదన ఎంత అర్ధరహితమో తెలుస్తోంది.

 

ఒకవేళ చంద్రబాబు నాయుడు కేసీఆర్ తో చేతులు కలిపి ఉంటే పట్టిసీమ ప్రాజెక్టుపై మరి కేసీఆర్ ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? ఆయనతో గొంతు కలిపి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు? అని ప్రశ్నించుకొంటే ఎవరి ఉద్దేశ్యాలు ఏమిటో తేటతెల్లం అవుతాయి.

 

రాయలసీమ ప్రాంతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి తన ప్రాంతానికి తెదేపా ప్రభుత్వం పట్టిసీమ ద్వారా నీళ్ళందిస్తే అప్పుడు ఆ ప్రాంతంలో రైతులు, ప్రజలు తెదేపాకు అనుకూలంగా మారితే తన పార్టీకి ఆ జిల్లాలపై పట్టుసడలుతుందనే భయంతోనే ఆయన పట్టిసీమను వ్యతిరేకిస్తున్నట్లున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని ఆయన దృడంగా భావిస్తున్నట్లయితే, ఆ విషయం గురించి మాట్లాడేందుకు అసెంబ్లీలో తనకు అవకాశం దక్కడం లేదని చెపుతున్నారు కనుక ఇలా మీడియా ముందుకు వచ్చి ఆవేదన పదేబదులు నేరుగా కోర్టులో ఒక పిటిషను వేస్తే సరిపోయేది కదా? కానీ ఆయన ఆవిధంగా చేయకుండా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా వితందవాదన చేయడం చూస్తుంటే ఈ అంశం మీద ఎంత ఎక్కువగా మాట్లాడగలిగితే అంత పొలిటికల్ మైలేజీ తనకు, తన పార్టీకి వస్తుందనే భ్రమలో ఉన్నారేమో? కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ ప్రాజెక్టుని, పధకాన్ని ఈవిధంగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రజలలో దృష్టిలో చులకనవుతున్నానని గ్రహించకపోవడమే విశేషం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu