రాజధాని భూసేకరణ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్
posted on Mar 17, 2015 5:19PM
(11).jpg)
విజయవాడకు చెందిన శ్రీమన్నారాయణ అనే వ్యక్తి తుళ్ళూరులో రాజధాని నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేప్పట్టి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం వేసారు. పంట పొలాలను సేకరించడం, దానిపై రాజధాని నిర్మించడం మానవ హక్కుల ఉల్లంఘన క్రిందే వస్తుందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.
కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఒప్పించి వారి వద్ద నుండి ముందుగా అంగీకార పత్రాలు తీసుకొని ఆ తరువాత వారితో ఒప్పందాలు కూడా చేసుకొని వారికి నష్టపరిహారంలో భాగంగా కొంత మొత్తానికి చెక్కులు కూడా అందించింది. అంటే ప్రభుత్వానికి, రైతులకు మధ్య చట్ట ప్రకారం ఒక అవగాహన కుదిరిన తరువాతనే భూసేకరణ జరిగినట్లు స్పష్టం అవుతోంది. కానీ నేటికీ కొన్ని గ్రామాలలో ప్రజలు, రైతులు ప్రభుత్వానికి తమ భూమినీ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. అటువంటి వారి వద్ద నుండి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసినట్లయితే వారు మాత్రమే కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవచ్చును. బహుశః అందుకే పిటిషనరు ఈ సమస్యను మానవహక్కుల ఉల్లంఘన అనే కోణంలో నుండి చూపుతున్నారని భావించవలసి ఉంటుంది.
కానీ ఇంతవరకు వచ్చిన తరువాత సుప్రీం కోర్టు జోక్యం చేసుకొంటుందా? అంటే అనుమానమే. రాష్ట్ర విభజన, ఎర్రగడ్డ వద్ద మానసిక మరియు చాతి వ్యాధుల ఆసుపత్రుల తరలింపు విషయంలో కొందరు వేసిన ఇటువంటి పిటిషన్లను కోర్టులు స్వీకరించినప్పటికీ, ప్రభుత్వ నిర్ణయాలలో జోక్యం చేసుకొనేందుకు ఇష్టపడలేదు. ఆ ప్రకారం చూసుకొన్నట్లయితే బహుశః ఈ కేసు విషయంలో కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోకపోవచ్చును.