జగన్‌ని కలిసిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి రోజుకొక వైసీపీ ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంప్ ఆఫీస్‌కు క్యూకడుతుంటే ఇవాళ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. జగన్‌ని కలిసింది ఎవరో కాదు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య.

 

అయితే జగన్‌ని కలిసింది ఏ పార్టీలో చేరడానికి కాదు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్న ఆయన దీనిలో భాగంగానే వైఎస్ జగన్‌ని కలిసి వినతిపత్రం అందించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాయాలని జగన్‌ని కోరారు. ఏపీలో వైసీపీ నేతలంతా టీడీపీలో చేరుతుండటంతో టీడీపీ ఎమ్మెల్యే అయిన కృష్ణయ్య జగన్‌ని కలవడంతో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.