ఉస్మానియాలో పాగాకు జగన్ ప్రయత్నం
posted on May 22, 2012 12:36PM
తెలంగాణా ఉద్యమానికి కేంద్రబిందువుగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పాగా వేయటానికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. తమ పార్టీ తరపున యూనివర్సిటీలో విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయటానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థి సంఘం ఏర్పాటు కోసం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కొందరు చురుకైన విద్యార్థులతో మంతనాలు జరిపినట్లు తెలిసింది.
ఉస్మానియాలో విజయవంతంగా విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయగలిగితే తెలంగాణలో తమ పార్టీ పాదం మోపటానికి సహాయపడుతుందనివై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయితే జగన్ ప్రయత్నాలను తిప్పికొడతామని యూనివర్సిటీలోని బిజెపి, టి.ఆర్.ఎస్. పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘ నేతలు హెచ్చరిస్తున్నారు. జగన్ కు అనుకూలంగా ఎవరైనా విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. జగన్ కరుడుకట్టిన సమైక్యవాది అని అటువంటి వ్యక్తికీ యూనివర్సిటీ విద్యార్థులు ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.