తెలంగాణలో కూడా జగన్ కు దెబ్బ.. టీఆర్ఎస్ లోకి పొంగులేటి, మరో ఎమ్మెల్యే..!

 

ఒకపక్క ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీడీపీలోకి చేరి వైసీపీ అధినేత జగన్ కు చెమటలు పట్టిస్తుంటే.. ఇప్పుడు తెలంగాణ నుండి కూడా జగన్ షాకులు ఎదురవుతున్నాయి. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లోలోకి జంప్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా పొంగులేటి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు ఆ సందేహాలకు తెర దించుతూ ఆయన టీఆర్ఎస్ ఎంట్రీ ఖాయమని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే ఆయన సోమవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారు.

 

పొంగులేటితోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా టీఆర్ఎస్లో చేరుతన్నట్టు సమాచారం. ఇంకా వీరితోపాటు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ, 102 మంది ఎంపీటీసీలు, నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, 15 మంది కౌన్సిలర్లు, 8 మంది సొసైటీ చైర్మన్లు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

 

ఇదిలా ఉండగా మరోవైపు తాను పార్టీ మారడం లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.