జగన్ కారును తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు.. తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టు

 

వైసీపీ అధినేత జగన్  కారును  రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 డీహెచ్‌ 2349 కారు ఫిట్‌నెస్‌ను ఎంవీఐ గంగాధర ప్రసాద్‌ ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు.  ప్రస్తుతం ఆ వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉంచారు. మాజీ  సీఎం రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు ఆయన కారు డ్రైవర్‌ రమణారెడ్డి, పీఏ నాగేశ్వర్‌రెడ్డి, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిని నిందితులుగా చేర్చారు. 

మరోవైపు జగన్‌కు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది.  సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్‌  అంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.