ఇప్పటికీ మీ పొలిటికల్ స్టోరీలో..విలన్ చంద్రబాబేనా కవితక్కా?
posted on Jun 27, 2025 12:47PM
.webp)
ఆంధ్రా బిర్యానీ ఏం తింటాం అంటూ కవితక్క ఈ మధ్య చేసిన కామెంట్ బాగా ట్రోల్ అవుతోంది. ఆమె అంటున్న మాటలను బట్టీ చూస్తుంటే వీళ్ల విన్నింగ్ ఎలిమెంట్ తెలంగాణా కన్నా మించి బాబుతోనే ఎక్కువగా ముడి పడి ఉందన్నట్టు తెలుస్తోంది. దానికి తోడు బీఆర్ఎస్ ప్రస్తుతం తన పార్టీ పేరులోని తెలంగాణ అనే ఒక సెంటిమెంటు మిస్ అయ్యింది. దీంతో చేసేది లేక తమ దగ్గరున్న పాత తెలంగాణ సౌండ్ తో ఉన్న సంస్థ ఏదని చూసిన వారికి కనిపించింది తెలంగాణ జాగృతి. దీన్ని మళ్లీ అటక మీద నుంచి దించి.. పాత బోనాల కుండకు కొత్త సున్నం కొట్టి అలంకరించినట్టు అలంకరించి చూశారు.
రాజీవ్, ఇందిర పేర్లేనా.. మా తెలంగాణ యోధులు ఎంత మంది ఉన్నారు? వారి పేర్లను ఎందుకు పెట్టొద్దని నిలదీశారు కవిత. అంతా బాగానే ఉంది. ఇది కరెక్టు కూడా. కానీ ఇదే జాగృతక్క తాను తెలంగాణకు సంబంధించిన ఒక పాటను ఎక్కడో పరాయి రాష్ట్రం వాడైన- గౌతం వాసుదేవ మీనన్ తో కోట్లు ఖర్చు పెట్టి చేయించారు. తనకు అలాంటి పాటింపులు ఉండవు కానీ.. తాను మాత్రం ఇతర్లను ఎంతో గొప్పగా నిలదీస్తారన్న పేరు సాధించారామె. ఇప్పుడు చూస్తే ఆంధ్ర బిర్యానిని అడ్డు పెట్టుకుని.. బాబును అటాక్ చేస్తున్నారు కవితక్క. నిజంగా అయితే ఇక్కడ టీడీపీ ఏమంత యాక్టివ్ గా లేదు. కాకుంటే గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ద్వారా బాబు ప్రభావం తెలంగాణపై ఇంకా ఉందంటూ ఆమె చేస్తున్న కామెంట్లు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయ్.
నిజానికి ఏపీకి తెలంగాణకి మధ్య ప్రస్తుతం బనకచర్ల బడబాగ్ని సలసల కాగుతోంది. కేసీఆర్ లా తాను కూడా.. ఏపీ ప్రోగా ఉండొచ్చు రేవంత్ రెడ్డి. కానీ ఆయన చూస్తే అలా లేరు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని స్పష్టంగా తెలియ చేస్తున్నారు. బేసగ్గా రేవంత్ రెడ్డి అలాంటి బ్లైండ్ మైండ్ సెటెడ్ ఫెలో అయి ఉంటే ఇదే అల్లు అర్జున్ ని జైల్లో పెట్టి ఉండరు. పెట్టాక పిలిచి మరీ అవార్డు ఇచ్చి ఉండరు. అవార్డు ఇచ్చాక అతడు కౌంటర్లు వేస్తున్నా చూస్తూ ఊరుకుని ఉండరు. దీన్నిబట్టీ ఇక్కడ లిబర్టీ ఎలాంటిదో తెలుసుకోవచ్చని అంటారు కొందరు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం బనకచర్ల విషయంలో చంద్రబాబుతో పీకలోతు పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి.. ఆయన ప్రభావంతో తెలంగాణను పాలిస్తున్నారని ఎలా చెప్పగలరో కేవలం కవితక్కకు మాత్రమే అర్ధమయ్యే భాష.బేసిగ్గా కవితక్క ప్రాతినిథ్యవ వహించే పార్టీకి కానీ కుటుంబానికి గానీ ఎప్పుడూ ఎవరో ఒక విలన్ కావాలి. ఆ విలనీ బాబులో చూసుకోవడం ద్వారా ఎక్కువ లాభాన్నిచ్చేది గతంలో. అయితే ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామ క్రమాల దృష్ట్యా కొన్నాళ్ల వరకూ ఆయన మాట ఉచ్చరించడం పక్కన పెట్టడంతో నష్టాలు, పరాజయాలు రావడం మొదలైంది. దీంతో తిరిగి తమ లక్కీ సెంటిమెంట్ తెలంగాణ, తమకు కలిసొచ్చే పొలిటికల్ విలన్ బాబు బ్రాండ్ వాడకాన్ని మొదలు పెట్టినట్టుంది. అందులో భాగంగానే కవితక్క ఈ బాబు నామ జపంగా తెలుస్తోందంటున్నారు విశ్లేషకులు.