అవినాష్ ’ముందస్తు‘ వెనుకడుగు..!
posted on Mar 29, 2023 11:15AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిలు కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వెంటనే ఉపసంహరించుకున్నారు.
గతంలో ఇదే కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనిఅవినాష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే ఆ పిటిషన్ ను పిటిషన్ ను విచారించిన హైకోర్టు .. ఆ విధంగా సీబీఐను ఆదేశించజాలమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం (మార్చి 28) ఉదయం తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో వివేకా హత్య కేసులో తన అరెస్టు అనివార్యమని ఫిక్సైపోయారా? అందుకే తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేశారా అన్న చర్చ జోరుగా సాగింది. అంతలోనే సాయంత్రానికి ఆయన తన పిటిషన్ ను ఉపసంహరించుకోవడంతో గంటల వ్యవధిలోనే ఆయన తన నిర్ణయం మార్చుకోవడానికి వెనుక ఏం జరిగిందన్న చర్చ మొదలైంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ హడావుడిగా హస్తిన పర్యటన పెట్టుకోవడానికీ, అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ ఉపసంహరించుకోవడానికీ ఏమైనా లింకుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి.