తెలుగుదేశం తెలుగువారి ఆత్మగౌరవ నినాదం!

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి (మార్చి 29) సరిగ్గా 41 ఏళ్లు.   తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ  అధినేత చంద్రబాబునాయుడు  పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టి, తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు.  అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తన అధికారిక ట్విట్లర్ ద్వారా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది.  ప్రతీ అడుగూ ప్రజల కోసం.. ఈ 41 సంవత్సరాల ప్రస్థానం.. ప్రగతి కోసం మన తెలుగుదేశం.. ఇది తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు ప్రజలందరికీ టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు అని పేర్కొంది. తెలుగుదేశం జెండా మోసిన ప్రతి కార్యకర్తకు, పార్టీ కోసం ప్రాణ త్యాగాలు చేసిన కార్యకర్తల, నాయకుల కుటుంబాలకు పాదాభివందనాలు.. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అంటూ ట్వీట్ చేసింది. ఇలా ఉండగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అండమాన్ నుంచి కూడా పార్టీ ప్రతినిథులు హాజరౌతారు. మొత్తం 15 వేల మంది ఈ సభకు హాజరౌతారని చెబుతున్నారు. సభకు వచ్చే ప్రతినిథుల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. మరో వైపు మంగళవారం (మార్చి 28)న జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొత్తం వంద సభలు నిర్వహించనుంది. బుధవారం (మార్చి 30) నుంచి ఈ సభలను ప్రారంభించి ఎన్టీఆర్ జయంతి అయిన మే 28 నాటిని పూర్తి చేయాలని డిసైడ్ చేసింది.  ఈ సభల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.

  హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ అధినేత  చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం (మార్చి28) పొలిట్‌బ్యూరో సమావేశంలో 17 అంశాలపై చర్చించారు. వీటిలో 13 ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి కాగా , తెలంగాణకు సంబంధించిన అంశాలు నాలుగు ఉన్నాయి.  ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడుని ఈసారి రాజమహేంద్రవరంలో మే 28,29 తేదీల్లో  నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది.  అలాగే  ఆర్థిక తారతమ్యం లేకుండా ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పన చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది.  ఇక ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఏప్రిల్‌ ఆఖరి వరకూ నిర్వహించాలని నిర్ణయించింది.  

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని పార్టీ క్యాడర్‌, లీడర్‌లకు దిశానిర్దేశం చేసింది. పార్టీ సభ్యత్వంలో జీవితకాల (లైఫ్‌ టైమ్‌) సభ్యులను చేర్చాలని నిర్ణయం తీసుకుంది.  ఈసమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, రెండు రాష్ట్రాలకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu