కర్ణాటకలో కలకలం..ఐదుగురు ఎమ్మెల్యేలు అదృశ్యం

 

కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతోంది. ఎమ్మెల్యేల ని కొనుగోలు చేయటానికి బీజేపీ బేరసారాలు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని కుమారస్వామి ధ్రువీకరించారు. బేరసారాలకు సంబంధించి ఓ ఆడియో టేప్ ని విడుదల చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జరుపుతున్న బేరసారాలు ఆడియో టేపులో రికార్డయ్యాయి. దీనిపై కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ... ‘‘రాత్రి 1:30 సమయంలో నాకు ఈ సమాచారం అందింది. మా పార్టీ ఎమ్మెల్యే అర్థరాత్రి సమయంలో నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అలాంటి విధేయత గల నాయకుల వల్లే మా పార్టీ ఇంకా రాష్ట్రంలో నిలిచిఉంది. ఎమ్మెల్యే నాగనగౌడ కంద్కూర్ కుమారుడు శరణకు ఎడ్యూరప్ప రూ.25 లక్షలు ఆశచూపారు. దీంతోపాటు ఆయన తండ్రికి మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేశారు..’’ అని పేర్కొన్నారు.

ఈ వ్యహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజలతో పాటు, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. దేశానికి తనకు తాను రక్షకుడుగా మోడీ చెప్పుకుంటునే మరోవైపు తనవారిని రక్షించుకునేందుకు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టబోమని బీజేపీ చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం మన రాజకీయ వ్యవస్థ స్థిరంగా ఎలా ఉండాలో పాఠాలు చెబుతారు. కానీ మరోవైపు మీ సన్నిహితుల ద్వారా ఇదే సూత్రాన్ని కాలరాసేలా ప్రోత్సహిస్తారు. మీకు నిజంగా నీతి అనేది ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని మోడీని డిమాండ్ చేస్తున్నా...’’ అని కుమారస్వామి పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న వారెవరో మోడీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. "ఎమ్మెల్యేల కొనుగోలుపై నేను ఇప్పుడు ఆధారాలు బయటపెడుతున్నాను. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చేందుకు బీజేపీ ఎలా ప్రయత్నిస్తున్నదో చూసి మీరే న్యాయం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.’’  అని కుమారస్వామి పేర్కొన్నారు.

ఇదిలాఉంటే బడ్జెట్‌ సందర్భంగా జేడీఎస్‌, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేశాయి. కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, అసంతృప్తులకు బీజేపీ గాలయం వేస్తోందని ఆరోపణలతో రెండు పార్టీల పెద్దలు అప్రమత్తమయ్యారు. సమావేశాలకు ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాలని విప్‌ జారీ చేశారు. ఏ ఒక్కరు రాకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని కూడా కుమారస్వామి ధ్రువీకరించారు. కర్ణాటకలో గత ఏడాది కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో తొలుత అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చింది. గవర్నర్‌ అవకాశమివ్వడంతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే శాసనసభలో ఆయన బలనిరూపణ చేసుకోలేకపోవడంతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆపరేషన్‌ కమల పేరుతో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను భాజపా ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఆడియో టేపును విడుదల చేయటం రాజకీయంగా దుమారాన్ని లేపింది.