చత్తీస్ గడ్ లో ఆగని  ఎన్ కౌంటర్లు... బస్తర్ లో ఈ ఏడాది 88 మంది నక్సలైట్లు దుర్మరణం 

ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.
నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అబూజ్ మాడ్ అటవీప్రాంతం ఈ ఉదయం కాల్పుల మోతతో దద్దరిల్లింది. టేక్ మెట్ట, కాకూరు గ్రామాల మధ్య ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. సీనియర్ మావోయిస్టు నేతలు సమావేశమవుతున్నారన్న సమాచారంతో డీఆర్ జీ, ఎస్టీఎఫ్ బలగాలు పక్కా ప్రణాళికతో అబూజ్ మాడ్ అటవీప్రాంతంలో ప్రవేశించాయి. 
కాకూరు గ్రామం వద్దకు చేరుకునే సరికి ఇరు వైపులా కాల్పులు ప్రారంభం అయ్యాయి. కాల్పుల అనంతరం ఘటన స్థలంలో ఏడు మృతదేహాలను కనుగొన్నట్టు బస్తర్ రేంజి ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. 
ఇదిలా ఉండగా చత్తీస్ ఘడ్ లోని కంకేర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కంకేర్ జిల్లా చోటేబెతియ ప్రాంతంలోని బినగుండా ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 29 మంది మావోలు చనిపోయారు.. ఓ ఇన్స్పెక్టర్ తో పాటు ఇద్దరు బిఎస్ఎఫ్  జవాన్లకు గాయాలు అయ్యాయి. .మావో అగ్ర నాయకుడు శంకర్ రావు ఈ ఎదురు కాల్పుల్లో చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ఆయననను పట్టుకున్న వారికి ప్రభుత్వం 25 లక్షల రివార్డు గతంలో ప్రకటించింది.మావోల నుంచి అత్యాధునిక ఆయుధాలు స్వాదినం చేసుకున్నారు. ఎకె  47 రైఫిల్ తో ఇన్సాస్ రైఫిల్స్ తో పాటు విప్లవ సాహిత్యం ఘటన స్థలంలో లభించాయని ప్రాథమిక సమాచారం. బిఎస్ఎఫ్ బలగాలతో పాటు  బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు తెలిపారు. చత్తీస్ ఘడ్ లో. ఇదే నెల 11వ తేదీన   చత్తీస్ గఢ్ లోని దంతెవాడలో కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. బిజాపూర్ లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను మావోయిస్టులు అడ్డుకున్నారు. నది వద్ద నిర్మస్తున్న వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడున్న పలు వాహనాలకు వారు నిప్పు పెట్టారు.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఒక మావోయిస్టు మృతి చెందగా, మిగిలిన వారి కోసం కూంబింగ్ చేపట్టారు. అదనపు బలగాలు కూడా అక్కడికి చేరుకోవడంతో సమీపంలోని అడవులను జల్లెడ పడుతున్నారు. వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్ల  నుంచి తేరుకోకమునుపే ఇవ్వాళ మరో ఏడుగురు నక్సలైట్లు మృత్యువాత పడటం నక్సలైట్ల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది. ఎన్ కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటి వరకు 88 మంది మావోయిస్టులు హతమయ్యారు.