ప్రభుత్వం కూటమిది.. రాజకీయం వైసీపీది!?
posted on Jan 30, 2025 2:42PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడుతూ రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. వారి తీర్పు మేరకు అఖండ మెజారిటీతో విజయం సాధించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అలా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి కొలువుదీరి కూడా ఏడు నెలలు గడిచిపోయింది. పాలన సజావుగా సాగుతోంది. అభివృద్ధి పరుగులు పెడుతోంది. జగన్ ఐదేళ్ల హయాంలో క్షణంక్షణం భయపడుతూ బితుకు బితుకు మంటూ గడిపిన జనం ఇప్పుడు స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. తమ ఆస్తులకు భ్రదత లేదన్న భయం నుంచి బయటపడ్డారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతల సమస్య లేదు. అయితే ఇది మాత్రం సరిపోతుందా? అంటే ఏ మాత్రం సరిపోదంటున్నారు జనం. మరి వారేం కోరుకుంటున్నారు? జగన్ హయాంలో అడ్డగోలు దోపిడీలకు, కబ్జాలకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకు వచ్చి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. జగమెరిగిన కబ్జాదారులపై కూడా ఇప్పటి వరకూ కేసులు నమోదు కావడం లేదు. అలాంటి కబ్జాదారుల గురించిన సమాచారం ప్రభుత్వానికి తెలియదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం వారిపై కేసులు నమోదు చేయడానికి ఇసుమంతైనా సుముఖంగా లేదా? యంత్రాంగంపై ప్రభుత్వానికి పట్టు లేదా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.
ఇందుకు తాజాగా వెలుగులోకి వచ్చిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా ఉదంతమే నిదర్శనం. ఒక ప్రముఖ దిన పత్రికలో పెద్ది రెడ్డి భూ కబ్జాలపై, అటవీ భూముల ఆక్రమణలపై వార్తా కథనం వచ్చింది. ఆ కథనంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మాణం కోసం అటవీ భూములను ఎలా దోచుకున్నారో?, ఆ ఫామ్ హౌస్ కోసం అటవీ భూములలో రోడ్డు వేయడానికి మార్కెట్ కమిటీ నిధులను ఎలా మళ్లించారో విపులంగా వివరణ ఉంది. దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు ప్రభుత్వం పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ, మార్కెట్ కమిటీ నిధుల మళ్లింపుపై దర్యాప్తునకు ఓ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసిందిన. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఫారెస్ట్ కన్సరేటర్ లు ఈ కమిటీలో ఉన్నారు. ఇక్కడ వరకూ బానే ఉంది, కానీ అధికార పగ్గాలు చేపట్టిన ఏడు నెలల తరువాత, అదీ ఒక పత్రికలో పెద్దిరెడ్డి భూ కబ్జాలు, అటవీ భూముల ఆక్రమణల గురించిన వార్త వస్తే తప్ప చంద్రబాబు సర్కార్ కు ఆ విషయం తెలియలేదా? ఇంత కాలం ఆ ప్రాంతంలో అధికారులుగా ఉన్న వారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి ఎందుకు నివేదించలేదు. వారంతా పెద్దిరెడ్డికి తొత్తులుగా వ్యవహరించారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
అంతే కాదు పేరుకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, పాలనా యంత్రాంగం అంతా ఇంకా జగన్ మనుషులతోనే నిండిపోయి ఉందా? జగన్ హయాంలో ఆయన అండ చూసుకుని దోపిడీలకు, కబ్జాలకూ పాల్పడిన పెద్దిరెడ్డి వంటి వారిని కాపాడటం కోసమే ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఒక్క పెద్ది రెడ్డి ఉదంతమే కాదు.. కొద్ది రోజుల కిందట వైఎస్ వెంకటరెడ్డి అనే జగన్ సమీప బంధువుకు నిబంధనలకు తిలోకాలిచ్చి మరీ అధికారులు సున్నపురాయి గని లీజును కట్టబెట్టారు. తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ తరువాత ఆ లీజును రద్దు చేశారనుకోండి అది వేరే విషయం. కానీ వరుసగా స్వల్ప వ్యవధిలో వెలుగులోకి వచ్చిన ఈ రెండు ఉదంతాలనూ చూస్తుంటే.. చంద్రబాబు సర్కార్ కు ప్రభుత్వ యంత్రాంగంపై పట్టే లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని లేకుంటే ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారడం తధ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.