ఎమ్మెల్యే అవినీతిపై చంద్రబాబుకు ఫిర్యాదు.. వైసీపీ నేత సంచలనం
posted on Apr 21, 2022 12:19PM
జగన్ పాలనలో అవినీతి ఆనకొండలా మారి సర్వం స్వాహా చేసేస్తోంది. వైసీపీ ప్రజాప్రతినిథుల అవినీతి బాగోతం చివరికి ఆ పార్టీ నేతలే భరించ లేని స్థితికి చేరుకుంది. ఇంకా పార్టీతో అంటకాగితే తమ రాజకీయ భవిష్యత్ శూన్యం అవుతుందన్న భయం వైసీపీ నేతల్లో కనిపిస్తున్నది. అయినా ధైర్యం చేసి బయటపడలేని పరిస్థితిలో మింగ లేక కక్కలేక బాధపడుతున్నారు. అధినేత దర్శనమే గగనం... అంతర్గత సంభాషణల్లో పలువురు తమ మనసులోని ఆవేదనను వెళ్లగక్కుతున్నారు.
అయితే నూజివీడు ఎమ్మెల్యే అవినీతిపై వైసీపీ నాయకుడొకరు సాక్షాత్తూ విపక్ష నేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు బుధవారంనూజివీడు నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెంలో గ్రామ సభ నిర్వహించారు. విపక్ష నేత హోదాలో గ్రామస్తుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సభలోనే అనూహ్యంగా వీసీపీ నాయకుడు కాజా రాంబాబు నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అవినీతిపై ఫిర్యాదు చేశారు. మేకా ప్రతాప్, ఆయన తనయుడి అవినీతి బాగోతం గురించి, అవినీతి సొమ్ము గురించి గణాంకాలతో సహా తన వద్ద సాక్ష్యాలున్నాయనీ చెప్పరు. అక్కడితో ఆగకుండా వాటిని చంద్రబాబుకు సమర్పించారు.
వైకాపా నేతనే అయినా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పుకున్న కాజా రాంబాబు ఈ పోరాటంలో పార్టీలో తాను ఒంటరినైపోయానని వాపోయారు. అయినా పార్టీ వీడనని స్పష్టం చేశారు. మరి చంద్రబాబు సభలో సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు ఆంతర్యమేమిటి? ఈ ప్రశ్న వేయకుండానే ఆయన అదే సభలో కారణం చెప్పేశారు. అవినీతిపై పోరాటంలో తనకు పార్టీ మద్దతు లభించడం లేదనీ, అందుకే విపక్ష నేత మద్దతు కోసం వచ్చాననీ చెప్పుకున్నారు.
సాక్షాత్తూ చంద్రబాబుకే వైపాకా నాయకుడు స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై ఫిర్యాదు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. వైకాపాలో ప్రకంపనలు ఆరంభమయ్యాయి. విపక్ష నేతకు వైకాపా నాయకుడు సొత పార్టీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడాన్ని పార్టీ అధినేత సీరియస్ గా తీసుకున్నారు. నేడో రేపో రాంబాబుపై చర్యలు తప్పకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాంబాబుపై పార్టీ ఏ చర్యలు తీసుకుంటుందన్నది పక్కన పెడతే వైకాపాలో విభేదాలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నదానికి ఈ ఉదంతం అద్దంపడుతుంది. గతంలోలా ప్రతి విషయానికీ అధినేత కోసం చూసే పరిస్థితి ఇప్పుడు వైకాపాలో కనిపించడం లేదు. నెల్లూరు సంఘటనలు తీసుకున్నా, ప్రకాశం జిల్లాలో ఉవ్వెత్తున ఎగసి చల్లారిన అసమ్మతిని గమనించినా ఈ విషయం బోధపడుతుంది. ఇక నూజివీడు వైకాపా ఎమ్మెల్యే అవినీతిపై ఆ పార్టీకే చెందిన నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు రానున్నరోజులలో మరెన్ని సంచలనాలకు తెరలేపుతుందో చూడాలి.