ఏబీవీ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు సీరియస్!.. జగన్ సర్కారుకు షాక్..
posted on Apr 21, 2022 12:22PM
ఏబీ వెంకటేశ్వరరావు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్. జగన్ సీఎం అయినప్పటి నుంచీ ఆయన్ను వేధిస్తోంది సర్కారు. చంద్రబాబు మనిషంటూ ముద్రవేసి.. సస్పెన్షన్ వేటు వేసింది. అలా అలా.. వారాలు.. నెలలు.. ఏళ్లుగా సస్పెన్షన్‌లోనే ఉంచుతోంది. ఇదేమీ రాజ్యం అంటూ.. న్యాయం కావాలంటూ పోరాడుతున్నారు ఏబీవీ. నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి తనపై సస్పెన్షన్ వేటు వేయడానికి వీళ్లేదని.. తనను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు.. పూర్తి జీతం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు ఏబీవీ.
తాజాగా, ఐబీ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్-ఎస్‌ఎల్‌పీ పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏబీవీపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలను పరిశీలించాలని సూచించింది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదేంటి.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు నిర్దేశాలు అడుగుతారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. శుక్రవారం అన్ని వివరాలతో రావాలని.. ఆ తర్వాత విచారణ వాయిదా వేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది ధర్మాసనం.