ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా రంగులు మారుస్తున్న వైసీపీ!
posted on Feb 25, 2025 3:27PM

అవసరానికి తగ్గట్టుగా రంగులు మార్చే ఊసరవిల్లి కూడా సిగ్గు పడేలా వైసీపీ తీరు ఉంది. నిన్నటి వరకూ తాము తిట్టిపోసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఇప్పడు తమ వాడిగా సొంతం చేసుకుని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. నిన్న తిట్టిన వ్యక్తులనే నేడు పొగడ్తలతో ముంచేయడం, నిన్న కాదన్న విషయాన్నే నేడు ఔనంటూ గట్టిగా వాదించడం వైసీపీకే చెల్లిందన్నట్లుగా ఈ పార్టీ తీరు ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో ఇప్పుడు ఆ పార్టీ అదే చేస్తున్నది. 2023లో రజనీ కాంత్ విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో పాల్గొన్నారు.ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, హదరాబాద్ ఐటీ హబ్ గా మారడానికి ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. వాస్తవానికి రజనీకాంత్ నాడు చేసిన వ్యాఖ్యలలో రాజకీయం ఏ మాత్రం లేదు. కానీ చంద్రబాబు గురించి రెండు మంచి మాటలు చెప్పడమే వైసీపీకి కంటగింపుగా మారింది. దీంతో రజకీకాంత్ పై ఇష్టారీతిగా విమర్శలతో చెలరేగిపోయారు. చంద్రబాబు పెంపుడు కుక్క అన్న స్థాయిలో రజనీకాంత్ పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా బూతుల నాని అదేనండి కొడాలి నాని అయితే నోటికొచ్చినట్లు మాట్లాడారు. స్వయంగా సనీ నటి కూడా అయిన రోజా కూడా రజనీకాంత్ పై ఇష్టారీతిగా విమర్శలు చేశారు. వీళ్లే కాదు వైసీపీలో చిన్నా చితకా నాయకులు కూడా రజనీకాంత్ పై నోరు పారేసుకున్నారు. అటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు రజనీకాంత్ ను భుజాన వేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల కిందట రజనీకాంత్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో విద్య అత్యవసరం అని నొక్కి చెప్పారు. ఇంగ్లీషు మీడియంలో చదవడం వల్ల వారు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. ఆ మాటలను పట్టుకుని ఇప్పుడు వైసీపీ నేతలు రజకీకాంత్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో విద్య అందించడానికి ప్రయత్నించినప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని అంటున్నారు. ఇప్పుడు రజనీకాంత్ ఇంగ్లీషు మీడియంలో పిల్లలకు విద్య అంశంపై చేసిన ప్రసంగం వీడియో క్లిప్పింగులను తమ ప్రాచారం కోసం విరివిగా ఉపయోగించుకుంటున్నారు.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించలేదు. ఆ మాటకొస్తే ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీషు మీడియంను తొట్టతొలి సారిగా ప్రవేశ పెట్టింది చంద్రబాబునాయుడే. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను పరిచయం చేసింది చంద్రబాబు నాయుడే. అయితే తెలుగును విస్మరించి పూర్తిగా ఇంగ్లీషు మీడియంకు మారడం అన్న విధానాన్నే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. విద్యార్థులకు ఇంగ్లీష్ తెలుగు మీడియంలలో దేనినో ఒక దానిని ఎంచుకునే ఛాయిస్ ఇవ్వాలని మాత్రమే చెప్పింది. అదే విధంగా ఇంగ్లీషు మీడియంకు పిల్లలు అలవాటు పడటానికీ, ఇంగ్లీషు మాధ్యమంలో ఉపాధ్యాయులు బోధన చేసేలా నైపుణ్యం పెంచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇంగ్లీషు మీడియంను దశల వారీగా అమలు చేయాలని చెప్పింది. వాస్తవం అలా ఉంటే వైసీపీ మాత్రం నాడు తాము దుయ్యబట్టిన రజనీకాంత్ మాటలను తమ అధినేత జగన్ ను సమర్ధిస్తున్నాయని చెప్పుకుంటూ నానా యాగీ చేస్తున్నది.