అవినాష్ అరెస్టు తథ్యం.. సీబీఐ దూకుడు అక్కడితో ఆగేనా?

అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగానే.. న్యాయనిపుణులే కాదు.. సామాన్య జనం కూడా విస్మయం చెందారు. టీవీ టాక్ షోలలో విశ్లేషకులు కూడా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ చివరి నిముషంలో మరో బెంచ్ కు మారడంపైనా సందేహాలు వ్యక్తం చేశారు.  మొత్తం మీద హైకోర్టులో అవినాష్ రెడ్డికి సీబీఐ అరెస్టు నుంచి తాత్కాలికంగానే అయినా ఊరట లభించడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని అంతా భావించారు. ఆ దిశగా పలు విశ్లేషణలూ చేశారు. అయితే హైకోర్టు ముందస్తు బెయిలుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఈ నెల 25 వరకూ అవినాష్ రెడ్డి ప్రతి రోజూ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పింది. దీంతో అవినాష్ రోజూ క్రమం తప్పకుండా గంటల తరబడి సీబీఐ విచారణను ఎదుర్కొంటూ వస్తున్నారు. అనూహ్యంగా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం (ఏప్రిల్ 21) విచారించింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహంలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. ఈ వాదనల సందర్భంగా  సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు అలాంటి తీర్పులు ఎలా ఇస్తారని ఒకంత తీవ్రంగానే వ్యాఖ్యానించారు.

అంతే కాదు హైకోర్టు ఇక అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ఈ నెల 25న  ముందస్తు బెయిల్ విషయంలో తుది తీర్పు ఇస్తామని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్యులలో పేర్కొంది. అయితే ఆ తేదీ కంటే ఒక రోజు ముందే..సుప్రీం కోర్టు ఈ విషయంలో తన నిర్ణయం ప్రకటించనుంది. అయినా వివేహా హత్య కేసు విషయంలో ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలంటూ సుప్రీం కోర్టు సీబీఐకి గడువు విధిస్తూ విస్పష్ట ఆదేశాలు జారీ చేసిన తరువాత కూడా తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చిందంటూ న్యాయనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అలాగే సామాన్య జనం కూడా తీర్పు ఇలా వచ్చిందేమిటి? అని విస్మయం చెందారు. సుప్రీం కోర్టు స్పందన కూడా  అలాగే ఉంది.   ఇక ఇప్పుడు ఈ నెల 24 వరకూ అంటే సోమవారం వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీం చెప్పినా.. అదేమీ ఆయనకు ఊరట కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విచారణ కోసం ఆ రోజు వరకూ ప్రతి రోజూ అవినాష్ సీబీఐ కార్యాలయం గడప తొక్కాల్సిందే. గంటల తరబడి వారి ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కొన వలసిందే. సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలతో అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో అరెస్టు కాకతప్పదన్న విషయం తేలిపోయిందని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఆ తరువాత కూడా కేసు దర్యాప్తు ముగించడానికి సుప్రీం సీబీఐకి విధించిన గడువులో మరో ఐదారు రోజులు మిగిలే ఉంటాయి కనుక సీబీఐ అరెస్టుల పర్వం అవినాష్ రెడ్డితో ఆగుతుందా? అవినాష్ విచారణలో తేలిన అంశాలు అధారంగా మరి కొందరికి కూడా సమన్లు జారీ చేస్తుందా అన్న అనుమానాలను న్యాయ నిపుణులు, పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.