కరోనా పునరాగమనం.. అతి భయం వద్దు.. జాగ్రత్తలే ముద్దు

దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ మరో వేరియంట్‌ వణికిస్తోంది.   ఫోర్త్‌వేవ్‌ అంటూ సర్వత్రా భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు   పెరగగడం ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న  కొత్త వేరియంట్‌ ఇప్పుడు దేశాన్ని చుట్టేస్తోంది. ఈ వేరియంట్‌ కేసులు   కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రమాదకరమైనదే అయినా పెద్దగా మరణాలు సంభవించలేదు. పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే థర్డ్‌వేవ్‌ ముగిసింది.

అయితే ఇప్పుడు కేసుల పెరుగుదల ఉధృతి సెకండ్ వేవ్ నాటి పరిస్థితులను స్ఫురింప చేస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  మళ్లీ కరోనా సీజన్‌ మొదలైందా అన్న ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ఎండమిక్ కు ముందు దశ అనీ,  అతిగా భయపడటం అనవసరమనీ వైద్య నిపుణులు చెబుతున్నారు.  మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడం ద్వారా ఎలాంటి ముప్పు లేకుండా ఈ దశ నుంచి బయటపడొచ్చనీ అంటున్నారు.అయితే కరోనా ప్రస్తత వ్యాప్తి తీవ్రతపై ఇంకా ఇంకా శాస్త్రీయమైన స్పష్టత రాలేదు.. ప్రస్తుతం సోకుతున్న కరోనా  లక్షణాలను అనలైజ్ చేసి నిర్ధారించాల్సిన అవసరం ఉంది.  శాస్త్రవేత్తలు ఆ పనిలోనే ఉన్నారు.

దీంతో కొత్త వేరియంట్ విషయంలో త్వరలోనే ఒక  స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాథమిక అంచనా మేరకు దీని వ్యాప్తి తీవ్రత వేగంగా ఉంటుందనీ, గతంలో వ్యాక్సినేషన్ చేయించుకున్న వారికి కూడా ఈ కొత్త వేరియంట్ నుంచి లక్షణ లేదనీ వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. ప్రజలలో ఆందోళనను పెంచేందుకు తప్ప ఇటువంటి వార్తల వల్ల మరే ప్రయోజనం ఉండదు. ప్రజలలో పేనిక్ కలిగించే ఇటువంటి వార్తలను, వదంతులను నమ్మకూడదు. ఇక జనంలో కూడా కరోనా మూడో వేవ్ తరువాత ఆ మహమ్మారి అంతరించిపోయిందన్న భావనకు వచ్చేశారు. ఇప్పుడు ఎవరూ మాస్కులు ధరించడానికి పెద్దగా సుముఖత చూపడం లేదు. రెండేళ్లు పండుగలూ, పబ్బాలకూ దూరంగా ఉన్న ప్రజలు ఇక అందుకు ఇష్టపడటం లేదు. కనుకనే  పండుగలు.. శుభకార్యాలలో గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారు.  ఇది ఎంత మాత్రం సరికాదు.

మొదటి సారి అత్యంత పకడ్బందీగా మహమ్మారిని కట్టడి చేసిన ప్రభుత్వాలు,  సెకండ్‌ వేవ్‌లో  మాత్రం పూర్తిగా విఫలమయ్యాయి. థర్డ్‌వేవ్‌లో ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించారు. అయితే ఆ తరువాత.. మహమ్మారి పునరాగమనాన్ని ఎదుర్కోనే విషయంలో మాత్రం ప్రజలలోనూ, ప్రభుత్వాలలోనూ కూడా సంసిద్ధత కొరవడింది.  అతి భయం అవసరం లేదు కానీ జాగ్రత్తలు పాటించే విషయంలో  ఎటువంటి నిర్లక్ష్యానికీ తావియరాదు.