అరెస్టు చేసేశాం..ఇప్పుడు అవినీతి జరిగిందో లేదో పరిశోధిస్తాం.. సీఐడీ వింత వాదన!
posted on Sep 26, 2023 11:19AM
జరిగిన అవినీతి చూపాల్సిన అవసరం లేదు. అవినీతి జరిగిందంటూ చేసిన ఆరోపణలను అరెస్టు చేసి, ఆ తరువాత దర్యాప్తు చేసి నిరూపిస్తామంటూ సీఐడీ వితండ వాదన చేస్తున్నది. అవును చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ తీరు ఇలాగే ఉంది. ఎలాగా అరెస్టు చేసేశాం కదా.. ఇక కస్టడీకి ఇవ్వండి, విచారించి అవినీతి జరిగిందో లేదో తేలుస్తాం అని కోర్టు ముందు చెబుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో సీఐడీ అనుసరించిన విధానం అదే. ఏవో సెక్షన్ పెట్టి కేసు నమోదు చేయడం, అరెస్టు చేసిన తరువాత ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చడం ఆ సెక్షన్ల ఆధారంగానే అరెస్టు చేశామని కోర్టుల్లో వాదించడం సీఐడీకి రివాజుగా మారిపోయింది.
స్కిల్ స్కాం జరిగిందని కానీ, చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని కానీ ఎలాంటి ఆధారం చూపకుండా వాటన్నిటినీ అరెస్టు చేశాం కదా ఇక విచారించి నిరూపిస్తాననడం చూస్తుంటే.. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎవరినైనా సరే అరెస్టు చేస్తాం..మా కేంటి అడ్డు అన్నట్లుగా ఏపీ సీఐడీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక అన్నిటి కంటే విచిత్రం ఏమిటంటే.. చంద్రబాబును అరెస్టు చేయడానికి అవసరమైన అన్ని ఆధారాలూ ఉన్నాయి కనుకనే అరెస్టు చేశామంటూ ఊరూరా తిరిగి మీడియా సమావేశాలు పెట్టి మరీ ఊదరగొడుతున్న సీఐడీ.. కోర్టుల్లో మాత్రం ఒక్క ఆధారమూ చూపడంలేదు.. సరికదా.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వండి ఆయనను ఇంటరాగేట్ చేసి ఆధారాలను ఎస్టాబ్లిష్ చేస్తామని చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ సీఐడీ చేసిన అరెస్టులన్నీ దాదాపు ఇదే విధంగా ఉన్నాయి. ఏపీ సీఐడీ అడ్డగోలు తీరుపై గతంలో కోర్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి కూడా అయినా ఆ దర్యాప్తు సంస్థలో ఇసుమంతైనా మార్పు రాలేదు.
ఇక ఇప్పుడు చంద్రబాబు అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అందుకు అనుసరించిన తీరు తీవ్ర విమర్శలకు గురౌతోంది. స్కిల్ కేసులో నగదు మళ్లింపు జరిగిందనీ, చంద్రబాబు షెల్ కంపెనీలకు ఆ నగదు చేరిందనీ సీఐడీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే నిధులు ఎలా దారి మళ్లాయి, మళ్లి ఎక్కడికి చేరాయి.. వంటి వివరాలేమీ సీఐడీ కోర్టుల ముందు చూపలేకపోతోంది. నోట్ ఫైల్స్ లో అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్ ఏదో రాశారంటూ.. ఆ కొద్ది భాగం లీక్ చేసి వైరల్ చేస్తున్న సీఐడీ అధికారులు కోర్టులలో మాత్రం నిధుల మళ్లింపు, షెల్ కంపెనీల ఊసెత్తడం లేదు. ప్రజా ధనం దుర్వినియోగమైందనీ, అది ఎలా దుర్వినియోగం అయ్యిందన్నది రుజువు చేయాలని, అది రుజువు చేయడం కోసం చంద్రబాబును ఇంటరాగేట్ చేయాలి ఇదే సీఐడీ కోర్టులకు చెబుతున్న మాట. అసలేమీ లేని కేసులో చంద్రబాబును అరెస్టు చేసి ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతున్నామని సీఐడీ చెబుతోంది.
చంద్రబాబును అరెస్టు చేయాలి అన్న సింగిల్ పాయింట్ అజెండాతో ఏపీ సీఐడీ వ్యవహరిస్తున్నట్లు ఉందని పరిశీలకులే కాదు, న్యాయనిపుణులు సైతం అంటున్నారు. అంతే కాదు సామాన్య జనం సైతం చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు. తన నాలుగేళ్ల పాలనలో జగన్ మూటగట్టుకున్న ప్రజా వ్యతిరేకతకు రెట్టింపు ప్రజావ్యతిరేకత చంద్రబాబు అరెస్టు తరువాత ఈ 18 రోజులలో జగన్ సర్కార్ పై వ్యక్తమౌతోందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. ఎన్ని తప్పులు చేసిన శ్రీకృష్ణుడు శిశుపాలుడి వందో తప్పు వరకూ ఎదురు చూసినట్లు జనం జగన్ ఇప్పటి వరకూ చేసిన అక్రమాలను సహించారనీ, చంద్రబాబు అరెస్టుతో ఒక్కొక్కరూ ఒక్కో కృష్ణుడిగా ఓటు అనే ఆయుధంతో జగన్ సర్కార్ శిరచ్ఛేదం చేయడానికి రెడీ అయిపోయారనీ అంటున్నారు.