కారు .. సారు ... బేజారు!

ఆయన మాటే శాసనం..అవును, బీఆర్ఎస్ లో కేసీఆర్ మాటే శాసనం, కాదని తోక జాడిస్తే, వారు ఎంతటి వారైనా... అంతే సంగతులు. నిముషాల్లో  తోక తెగిపడుతుంది. అది ఎంతటి వారైనా సరే వేటు అనివార్యం అవుతుంది. గతంలో అటు ఉద్యమంలో ఇటు ప్రభుత్వంలో కేసీఆర్’కు కుడి భుజంగా ఉన్న ఈటల  రాజేందర్ పై ఏవిధంగా వేటు వేసింది అందరికీ తెలిసిందే.  ఈటల కంటే ముందు చాలామందే కోదండ రామ్ సార్ ..సహా చాలామందే  ఆ జాబితాలో ఉన్నారు. అయినా  ఈటల పై వేటు  కేసీఆర్  దొర  నైజానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నదని అంటారు. నిజానికి  ఈటల మనసులో ఆ భావన  బాధ ఉన్నాయో లేవో కానీ  ఏదో సందర్భంలో  గులాబీ జెండాకు అసలు ఓనర్లం మేమే  అంటూ బడుగుల తరపున ఒక  ధిక్కార  ప్రకటన లాంటింది చేశారు. అంతే  ఇక ఆ  తర్వాత ఏమి జరిగిందో చరిత్ర.  అది అందరికీ తెలిసిన విషయమే. 
అయితే ఇప్పడు పరిస్థితి అది కాదంటున్నారు.కారు జోరుకు హస్తం బ్రేకులు వేస్తున్న నేపథ్యంలో  కేసీఆర్  స్టైల్ మారిందని అంటున్నారు. నినమొన్నటి దాకా, ముఖ్య నేతలు , మంత్రులకే ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ అసాధ్యం అనే పరిస్థితి ఉంటే  ఇప్పడు అడిగిందే తడవుగా  ముఖ్యనేతలకే కాదు, మరెందరికో , ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అడిగిన వారందరికీ  ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ లభిస్తోందని అంటున్నారు.అంతే కాదు  కొందరికైతే, ప్రగతి భవన్  నుంచే ఆహ్వానాలు అందుతున్నాయంటున్నారు. ఇది ముఖ్యమంత్రిలో మార్పుకు సంకేతమని అస్మదీయులు  ఆనంద పడుతుంటే, తస్మదీయులేమో, ఇదంతా ఎన్నికల జిమ్మిక్కని, కొట్టి పారేస్తున్నారు. అయితే, ముఖ్యంత్రిలో మార్పుకు రాష్టంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలే ప్రధాన కారణమని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెరిగి కమలం కనుమరుగై పోతున్న నేపధ్యంలో సార్.. బేజారవుతున్నారని అంటున్నారు. నిజానికి  కాంగ్రెస్ లో జోష్ పెరగడం కంటే, బీజేపీ,  బ్యాక్ టూ స్క్వేర్ వన్  అనగా ఒక్క సీటు స్థాయికి జారుకోవడం కేసీఆర్ ను కలవరపాటుకుకు గురిచేస్తోందని అంటున్నారు. తొమ్మిదేళ్ళ తెరాస/బీఆర్ఎస్ పాలనతో విసిగి పోయిన జనం ప్రభుత్వ వ్యతిరేక  ఓటు ఏకమైతే కర్ణాటక ఫలితమే తెలంగాణలోనూ తప్పదని, అందుకు తగట్టుగానే  కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ఫార్ములానే ఇక్కడ ఫాలో అవుతున్న నేపధ్యంలో ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయనే, ప్రచారం జరుగుతోంది. అందుకే కారులో కలకలం మొదలైనదని చెబుతున్నారు. అందుకే బేజారైన కేసీఆర్ సారు... బుజ్జగింపులకు తెర తీశారని అంటున్నారు. అందులో భాగంగానే, అసంతృప్తులకు  స్వయంగా ప్రగతిభవన్‌  నుంచి ఆహ్వానాలు వస్తున్నాయంటున్నారు. బుజ్జగిస్తూ కేసీఆర్ పదవుల ఎర వేస్తున్నారని అంటున్నారు.

నిజానికి ఒక వ్యూహం ప్రకారమే, ముఖ్యంత్రి కేసీఆర్ ముందుగా  నాలుగు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకూ  అభ్యర్ధులను ప్రకటించారు. అయితే టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ఆ సందేశాలు ప్రగతి భవన్ కు   చేరాయి.  అయినా  బీఆర్ఎస్ పెద్దలు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ తమకు ‘రియల్ థ్రెట్’ గా మారుతోందని గుర్తించారో, ఇక అక్కడి నుంచి  కేసీఆర్  మారి పోయారని అంటున్నారు. 

అందుకే వ్యూహం మార్చి బుజ్జగింపులు ప్రారంభించారని అంటున్నారు., జనగాం, స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య విషయంలో ఇదే జరిగింది. అధిష్ఠానం వీరికి టికెట్లు నిరాకరించడంతో.. రాజయ్య ఒక దశలో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆ ఇరువురిని ప్రగతి భవన్‌కు పిలిపించి బుజ్జగించారు. ఒకరికి రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌ పదవి, మరొకరికి ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తామని ఆశల హామీ ఇచ్చారు. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీకి తీరని నష్టం కలిగిస్తారనుకున్న వారిని పిలిచి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చివరి దశకు చేరుకున్న సమయంలో.. ఏళ్లుగా భర్తీ చేయని పదవుల పందేరానికి కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నూతన చైర్మన్‌, సభ్యులను నియమించారు.

అయితే, కేసీఆర్  లో వచ్చిన మార్పునకు మురిసి పోవలసిన అవసరం లేదని, కొందరు ముఖ్య నేతలు, మరీ  ముఖ్యంగా అసంతృప్తులు అంటున్నారు. అందితే జుట్టు అందకే పొతే .. కాళ్ళు పట్టుకోవడం రాజకీయాల్లో అందరూ ఆచరించే సంప్రదాయమే అయినా ఈ విద్యలో కేసేఆర్ రెండు కాదు పది ఆకులు  ఎక్కువ చదివారని ముఖ్య నేతలు అంటున్నారు. అలాగే  ముఖ్యమంత్రి కేసీఆర్  కు ఎక్కడ నెగ్గాలో  మాత్రమే కాదు  ఎక్కడ తగ్గాలో కూడా తెలుసునని అంటుంటారు. అందుకే  కేసీఆర్ మరి పోయారని, ఇక పై  ప్రగతి భవన్ గేట్లు 24/7 బార్లా తెరిచి ఉంటాయని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుందని, లోగుట్టు తెలిసిన పెద్దలు చెపుతున్నారు.