బీజేపీలో చేరితే అవినీతి పరులు పునీతులైపోతారా అమిత్ షా జీ?

సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ఈమాట,ఈ ఆరోపణ ప్రతి రోజూ వినిపిస్తూనే ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొదలు కల్వకుంట్ల కవిత వరకూ, మమతా బెనర్జీ మొదలు అరవింద్ కేజ్రివాల్, కేసీఆర్,కేటీఆర్ వరకూ,శరద్ పవార్ మొదలు ఉద్ధవ్ థాకరే వరకూ, చిన్నా పెద్ద అవినీతి అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న రాజకీయ నాయకులు, ఆ నాయకుల సమర్ధకులు ప్రతి రోజూ ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అయితే, అది కొంతవరకు నిజమే అయినా సంపూర్ణ సత్యం అయితే కాదు. అధికారం ఉన్నదే దుర్వినియోగం చేసేందుకు, దుర్వినియోగం కాని, అధికారం అసలు  అధికారమే కాదు, అనే వాళ్ళు, అనుకునే వారు లేక పోలేదు. 

అయితే ఇటీవల కాలంలో  కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ వరకు ప్రతిపక్ష పార్టీలన్నీ,కోరస్ గా ఒకటే మాట అటున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలపై కక్షకట్టి కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు హోంశాఖ మంత్రి అమిత్ షా గట్టి సమాధానం ఇచ్చారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తోన్న కేసుల్లో రెండు మినహా మిగతావన్నీ యూపీఏ హయాంలో నమోదైనవేనని ఆయన తేల్చిచెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పాదర్శకంగా పనిచేస్తున్నాయని, అయినా, ఆ దర్యాప్తుల్లో తప్పుందనిపిస్తే కోర్టుకెళ్లొచ్చని అమిత్ షా తెలిపారు. 

అలాగే ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు, నాయకులపై వస్తున్న ఆరోపణల విషయంలో విచారణ ఎందుకు జరపడం లేదని ఓ పక్క ఆరోపిస్తూనే, మరో వంక తమ పై జరుగుతున్న విచారణ మాత్రం కక్ష సాధింపు చర్యగా ఆరోపిస్తున్నారని అన్నారు. ఇందుకు సంబంధించి, 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ కు చెందిన ఓ ముఖ్య నాయకురాలు, అవినీతి పాల్పడితే ఎందుకు విచారించట్లేదని మమ్మల్ని ప్రశ్నించారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఆ పని చేస్తుంటే మేం కుట్ర చేస్తున్నామని ఆరోపిస్తున్నారు. ఈ దర్యాప్తు సంస్థలు కోర్టులకు అతీతమేమీ కాదు. నోటీసులు, ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జ్‌షీట్లపై వారు న్యాయస్థానాల్లో సవాల్‌ చేయొచ్చు. కానీ, వారు కోర్టులను ఆశ్రయించకుండా, వీధుల్లో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కోర్టులకు వెళ్లకుండా వారిని ఎవరు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. నిజానికి  బీజేపీలో కంటే  కాంగ్రెస్ పార్టీలోనే మంచి లాయర్లున్నారు. అయినా ఓ వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు చేపట్టకూడదా? ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న కేసుల్లో రెండు మినహా మిగతావన్నీ కాంగ్రెస్ సారథ్యంలోని  యూపీఏ ప్రభుత్వ  హయాం నమోదైన కేసులే   అని అమిత్ షా పేర్కొన్నారు.

 పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు చోటుచేసుకున్నాయని అమిత్ షా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి  రాజకీయ దుమారం చెలరేగడంతో, ప్రజల దృష్టిని మరల్చేందుకు,యూపీఏ ప్రభుత్వమే సీబీఐతో కేసులు నమోదు చేసిందని గుర్తుచేశారు.అందులో ఏమైనా మనీలాండరింగ్‌ ఆరోపణలు వస్తే.. ఈడీ తప్పకుండా దర్యాప్తు చేస్తుందని తెలిపారు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చట్టాలను పాటించాల్సిందే. మరో మార్గం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. 

అలాగే, పార్లమెంట్ ను కుదిపేస్తున్న అదానీ’ వ్యవహారంపై  కూడా అమిత్ షా స్పందించారు.  ఆ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై ఎవరి దగ్గరైనా సాక్ష్యాలుంటే ఆ కమిటీకి సమర్పించొచ్చు. తప్పు జరిగిందని తేలితే ఎవర్నీ వదిలిపెట్టబోం. న్యాయపరమైన ప్రక్రియపై అందరూ విశ్వాసం ఉంచాలి. అయితే, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. అటు సెబీ కూడా దీనిపై దర్యాప్తు చేస్తోంది  అని అమిత్ షా వివరించారు. అయితే, విపక్షాల విషయాన్నిపక్కన పెడితే అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న రాజకీయ నాయకులు  బీజేపీలో చేరగానే ఎలా పునీతులు అవుతున్నారు?  సామాన్య ప్రజలు అడుగుతున్న అసలు ప్రశ్న, ఈ ప్రశ్నకు బదులేది? అమిత్ షా ..జీ ..